ఇస్మార్ట్ సిగరెట్ కు పోలీస్ షాక్

0

పొగాకు వాడకం నియంత్రించేందుకు ప్రభుత్వం తెచ్చిన కొన్ని సంస్కరణలు సినిమాలకూ వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రతి పొగ లేదా మందు తాగే సీన్ లో వార్నింగ్ పెట్టడం కంపల్సరిగా మారింది. బహిరంగంగా అతికించే పోస్టర్లలోనూ ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందే. దీన్ని మర్చిపోయిన ఇస్మార్ట్ టీమ్ కు బెంగుళూరు పోలీస్ చిన్న షాక్ ఒకటి ఇచ్చారు. విషయానికి వస్తే నగరంలోని మంత్రి మాల్ ఐనాక్స్ సినిమా కాంప్లెక్స్ లో హీరో రామ్ సిగరెట్ తాగుతున్న పోస్టర్లను అక్కడ డిస్ప్లే చేశారు.

ఇది పబ్లిక్ ని ప్రేరేపించే విధంగా ఉందని కొప్టా యాక్ట్ (పొగాకు మరియు ఇతర సంబంధిత ఉత్పత్తుల చట్టం)ప్రకారం థియేటర్ యాజమాన్యం సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ పూరినే కాబట్టి సమాధానం పంపాలి. ఇది సదరు చట్టంలోని సెక్షన్ 5ని ఉల్లంఘించే విధంగా ఉందని హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తరఫున జాయింట్ డైరెక్టర్ దీన్ని జారీ చేశారు. అదే నోటీసులో కొన్ని విషయాలను పేర్కొంటూ రాష్ట్రంలో 19 ఏళ్ళకే పొగాకు బారిన పడుతున్న యువత అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016-17 సంవత్సరానికి పొగాకు వాడకం గురించి ఇచ్చిన వేదికలో కర్ణాటకలో కోటిన్నర పైగా ఈ అలవాటు చేసుకుని వ్యాధుల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని అందులో వివరించింది. ప్రతి సంవత్సరం ఈ కారణంగానే లక్షకు పైగా పౌరులు పొగాకు సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని చెప్పిన శాఖ మీ పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. అసలే సక్సెస్ సాధించిన కిక్ లో ఫుల్ జోష్ లో ఉన్న పూరి టీమ్ కి ఇదొక ట్విస్ట్ అనే చెప్పాలి. ఎక్కడా రాని అభ్యంతరం ఒక్క బెంగుళూరులోనే రావడం కొసమెరుపు.
Please Read Disclaimer