చరణ్ ప్రమాదంపై RRR టీమ్ క్లారిటీ

0

RRR చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2020 జూలై 30 రిలీజ్ తేదీని లాక్ చేశారు. అయితే ఆరంభమే సెట్స్ లో గాయాల గురించి ఆసక్తికర చర్చ సాగింది. చరణ్ .. ఎన్టీఆర్ గాయాల వల్ల రెండుసార్లు షూటింగ్ ని వాయిదా వేయడంపై చర్చ సాగింది. తాజాగా రామ్ చరణ్ కి సెట్లో మరోసారి గాయం అయ్యిందని ప్రచారమైంది. అయితే ఈసారి గాయం చాలా చిన్నదే. ఓ పాట కోసం డ్యాన్స్ మూవ్ మెంట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలు జారి వెనక్కి పడిపోయారని ప్రచారమైంది.

అయితే ఈ వార్తల్ని ఖండిస్తూ చిత్రయూనిట్ తాజాగా వివరణ ఇచ్చింది. చరణ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతడు ప్రస్తుతం యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిన్న .. ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు. తప్పుడు ప్రచారం చేయొద్దని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ టీమ్ తెలిపింది. మెగా పవర్ స్టార్ పూర్తి క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. దీంతో గాయం పుకార్లపై పూర్తి క్లారిటీ వచ్చినట్టయ్యింది.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు అల్లూరి సీతారామరాజు- కొమరం భీమ్ కలిసి ఆంగ్లేయులపై పోరాటం సాగించి ఉంటే ఏం జరిగేది? అన్న ఫిక్షన్ కథతో తెరపై చూపిస్తున్నామని దర్శకరచయితలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer