పవర్ స్టార్ రీఎంట్రీపై అవన్నీ రూమర్లేనా?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నారని .. త్వరలోనే సినిమాని ప్రకటిస్తారని రకరకాలుగా ప్రచారమవుతోంది. ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి ఈ రూమర్లకు మరింత ఊతం పెరిగింది. ఇప్పటికే పవన్ ని ఇద్దరు ముగ్గురు ఫిలింమేకర్స్ సంప్రదించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతోంది. చిరు .. చరణ్ తలో మాట అనడం కూడా ఈ రూమర్స్ కి అడ్డూ ఆపూ లేకుండా చేసింది. పవన్ ఇంకా కథలు వింటున్నారు అని చరణ్ అన్న మాటతో అవి పీక్స్ కి చేరుకున్నాయి.

ఇంతకుముందు పింక్ రీమేక్ కోసం బోనీకపూర్ పవన్ ని కలిశారని ఆ కథ పవన్ కి నచ్చిందని ప్రచారమైంది. తమిళంలో అజిత్ నటించగా బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ రీమేక్ కి పవన్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని మాట్లాడుకున్నారు. అలాగే క్రిష్ ఇప్పటికే పవన్ ని కలిసి ఓ సామాజికాంశంపై కథను వినిపించారని అది పవన్ కి నచ్చేసిందని కూడా ప్రచారం హోరెత్తింది. స్టోరి లైన్ నచ్చినా పవన్ పూర్తి స్క్రిప్టు వినలేదని.. మరో కొసరు ప్రచారం కూడా ఉంది. తాజాగా క్రిష్ ఓ జానపద కథాంశంతో పవన్ ని ఒప్పించే వీలుందన్న ప్రచారం మొదలైంది. క్రిష్ ఎవరూ ఊహించని విధంగా ఓ హిస్టారికల్ కథాంశాన్ని తీసుకుని పవన్ కి వినిపించారని దీనిని జానపద శైలిలో తెరకెక్కిస్తారని హుషారైన ప్రచారం మొదలైపోయింది. వందేళ్ల నాడు జరిగిన కథ అంటూ టముకు వేస్తున్నారు. మరోవైపు పవన్ రీఎంట్రీ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా కొనసాగుతారని అందుకు కథ రెడీ అవుతోందన్న ప్రచారం ఉంది. పవన్ తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇస్తే తన కోసం చరణ్ వెయిటింగ్ అని చిరు అనడంతో అభిమానుల్లోనూ హుషారు మరింత పెరిగింది. వీళ్లతో పాటు చిరు- పవన్ లను కలిపి మల్టీస్టారర్ తీసేందుకు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి- అశ్వనిదత్ బృందం చాలాకాలంగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పవన్ ఎవరికైనా ఓకే చెప్పారా? ఆయన అంగీకరించేందుకు ఆస్కారం ఉందా? అంటే అసలు ఇప్పటివరకూ ఎవరికీ ఓకే చెప్పిందే లేదు. సినిమాల్లోకి రాను. రాజకీయాలకే అంకితం!! అని పవన్ ఇదివరకూ ప్రకటించారు. ఇంతవరకూ పవన్ తో సినిమాలు చేస్తామన్న వాళ్లు ఎవరూ కథల్ని ఫైనల్ చేయలేదు. స్క్రిప్టు పూర్తి స్థాయిలోనూ రెడీ కాలేదు. అందువల్ల వినిపించేవన్నీ రూమర్స్ మాత్రమేనని భావించాల్సి ఉంటుంది. ఈ గాసిప్స్ అన్నీ టూమచ్ అనేంతగా ప్రచారం అయిపోతున్నాయి. స్టోరిలైన్ ఓకే అయితే ప్రాజెక్టు ఓకే అయినట్టు కాదు. రెండేళ్లు డిస్కస్ చేశాక ఆగిపోయినవి ఎన్నో. కాబట్టి ఒకసారి ఠెంకాయ కొట్టి రెగ్యులర్ షూట్ మొదలయ్యాకే ప్రాజెక్టు సెట్స్ కెళుతున్నట్టు.
Please Read Disclaimer