పండుగ వేళ బాలీవుడ్ అలా.. టాలీవుడ్ ఇలా

0

సంక్రాంతి సందడి మొదలైంది. సినిమాలు వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ వేళ తమ సినిమాలు విడుదల చేయటానికి పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు వేసే ప్లాన్లు అన్ని ఇన్ని కావు. పోటీ తీవ్రంగా ఉన్న వేళ.. తమ సినిమాలతో సక్సెస్ కొట్టేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి పండక్కి తెలుగులో నాలుగు సినిమాలు (రజనీ డబ్బింగ్ మూవీతో పాటు) విడుదల అవుతుంటే.. బాలీవుడ్ సైతం పలు చిత్రాల్ని రిలీజ్ చేశాయి.

పండుగ వేళ విడుదలవుతున్న బాలీవుడ్.. టాలీవుడ్ కు సంబంధించి సినిమాల్లో ఒక తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చాలావరకూ తెలుగు సినిమాల నిడివి రెండున్నర గంటలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత వరకు రెండుబావు గంటల నుంచి రెండున్నర గంటల మధ్య ఉండేలా చూసుకుంటున్నారు. అదే సమయంలో.. బాలీవుడ్ సినిమాల నిడివి రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకూ ఉంటున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం రెండు గంటలు.. లేదంటే మరో ఐదారు నిమిషాల కంటే మించి ఉండకుండా ప్లాన్ చేస్తున్నాయి.

తాజాగా పండుగ వేళ విడుదలైన టాలీవుడ్ చిత్రాల రన్నింగ్ టైం రెండున్నర గంటలకు మించి ఉంటే.. విచిత్రంగా బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన చిత్రాల నిడివి రెండు గంటల పది నిమిషాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. పండుగ సీజన్ లో తొలుత విడుదలైన రజనీ దర్బార్ చిత్ర నిడివి 2.40 గంటలు ఉంటే.. తర్వాత విడుదలైన మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు ఏకంగా 2.49 గంటలు ఉంది. ఇక.. ఈ రోజు (ఆదివారం) రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో చిత్ర నిడివి మాత్రం ఈ రెండింటికి తగ్గని రీతిలోనే ఉంది. ఈ చిత్ర నిడివి 2.45 గంటలు. రానున్న కల్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా సినిమా నిడివి కూడా రెండున్నర గంటలకు ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు.

అదే సమయంలో పండుగ వేళ విడుదలైన బాలీవుడ్ మూవీల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంది. విడుదలకు ముందు భారీగా బజ్ అయిన దీపిక నటించిన చపక్ మూవీ కేవలం 2గంటల మూడు నిమిషాలకే పరిమితమైతే.. విడుదలకు ముందు.. విడుదల తర్వాత మంచి టాక్ సొంతం చేసుకున్న చారిత్రక మల్టీస్టారర్ మూవీ తనాజీ చిత్రం సైతం 2.15 గంటలకే పరిమితం కావటం గమనార్హం. మొత్తంగా ఈసారి విడుదలైన బాలీవుడ్.. టాలీవుడ్ సినిమాలకు సంబంధించి మరో తేడా కూడా కొట్టొచ్చినట్లుగా ఉంది.

బాలీవుడ్ సినిమాలు సీరియస్ అంశాల్ని.. చారిత్రక అంశాలతో సినిమాలు ఉంటే.. టాలీవుడ్ మాత్రం పండక్కి వచ్చిన విషయాన్ని తమ సినిమాలోనూ ప్రస్తావిస్తూ.. సంక్రాంతి స్పెషల్ అన్న మాటను చెప్పేయటం.. అందుకు తగ్గట్లే కామెడీ.. యాక్షన్.. సెంటిమెంట్ ను దట్టించి.. పండుగ భోజనం లాంటి సినిమాల్ని తీసుకురావటం కనిపిస్తోంది.
Please Read Disclaimer