మేం ఆర్టిస్టులం..టెర్రరిస్టులం కాదు:కార్తికేయ

0

సినిమాలోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది నిజ జీవితంలో ఘటనలు జరుగుతాయా….? నిజ జీవితంలో ఘటనల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు తెరకెక్కిస్తారా?…కొన్ని సినిమాల విషయంలో ఇటువంటి చర్చలు జరగడం సహజం. సినిమాల ప్రభావం పాక్షికంగా ప్రేక్షకుల మీద సమాజం మీద ఉంటుందని….సినిమాలలోని చెడు ప్రేక్షకులు ఎక్కువగా స్వీకరిస్తారని వాదించేవారు కొందరైతే….అలా అని అపరిచితుడు – భారతీయుడు వంటి సినిమాలు చూసి దేశం మొత్తం మారిపోలేదని వాదించేవారు మరికొందరు. సరిగ్గా ఇదే తరహా వాదనకు తాజాగా జగిత్యాలలో జరిగిన జంట ఆత్మహత్యల ఘటన తావిచ్చింది. ఆర్ ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో ఆ ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని కొన్ని మీడియా చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో తమ సినిమాపై దుష్ప్రచారం జరగడాన్ని ఆ చిత్ర హీరో కార్తికేయ గుమ్మకొండ ఖండించారు. తమ సినిమా వల్లే ఆ ఇద్దరు చనిపోయారనడం సరికాదని…ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్ లో ఆదివారం రాత్రి కూసరి మహేందర్(16) బంటు రవితేజ(16) మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని పిల్లా రా పాటను మహేందర్ పదే పదే చూసేవాడని ఆ సినిమాలో హీరోలా తానూ చనిపోతానని మహేందర్ తన మిత్రులతో చెప్పేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరో తరహాలో అమ్మాయితో ప్రేమలో పడి వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటూ కొన్ని చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను కార్తికేయ ఖండించాడు.

ఆర్ఎక్స్ 100 సినిమాను మీడియాలో విలన్ గా చూపించడం సరికాదని కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లా రా పాటలో హీరో సూసైడ్ చేసుకోడని – రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆ పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారని అన్నాడు. అసలు – ఆ సినిమాలో హీరో ఎక్కడా సూసైడ్ చేసుకోడని – ఇందూ అనే క్యారెక్టర్ హీరోను చంపిస్తుందని చెప్పాడు.

చాలా సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు ఉంటాయని – సినిమాను సినిమాలాగే చూడాలని అన్నాడు. ఈ సినిమా చూసి చనిపోవాలని – నెగిటివ్ గా తీసుకోమని ఏ ఆర్టిస్టు చెప్పరని అన్నాడు. ఒకవేళ కొందరు పిల్లలు అలా నెగెటివ్ గా ఇన్ ఫ్లూయెన్స్ అవుతున్నారంటే వాళ్ల మైండ్ సెట్ మార్చాల్చిన అవసరం ఉందని వాళ్లు ఇంకా ఎదగలేదని అన్నాడు. మన చుట్టూ అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలను కరెక్ట్ దారిలో నడిపించాల్సిన బాధ్యత మనకు ఉందని అన్నాడు. ఇటువంటి బాధాకరమైన ఘటనలు జరిగినపుడు కేవలం ఆర్టిస్టులను – డైరెక్టర్లను టెర్రరిస్టుల్లా చూడటం కరెక్ట్ కాదని అన్నాడు. తమను నెగెటివ్ గా చూడటం మానేయాలని ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా యువతను పిల్లలను మోటివేట్ చేయాలని కార్తికేయ పిలుపునిచ్చాడు.