తేజుది మత్తిచ్చే గ్లాసు.. జనసేనది మత్తు దించే గ్లాసు

0

ఏపీ రాజకీయాన్ని నాలుగు ముక్కల్లో చెప్పమని అడిగితే..ఫ్యాను.. సైకిలు.. గ్లాసు.. హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ‘సుత్తి-కొడవలి’.. ‘సుత్తి-కొడవలి-నక్షత్రం’ గుర్తులు కూడా ఉంటాయి. ఎలెక్షన్ సీజన్ కాబట్టి ఓటర్లకు గుర్తులు తెలియడం చాలా ముఖ్యం. ఇంతకీ ఈ ఎలెక్షన్స్ సింబల్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే గ్లాస్ మేట్స్ పాట వల్ల.

మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా ‘చిత్రలహరి’ నుండి ‘రాక స్టారుడు’ దేవి శ్రీప్రసాద్ స్వరపరిచిన గ్లాస్ మేట్స్ పాటను ఈమధ్యే విడుదల చేశారు కదా. అసలే తేజు చిన్నమావయ్య పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడని అందరికీ తెలుసు. పైగా జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’. దీంతో పాట రిలీజ్ కు ముందు తేజు తన చినమావయ్య పార్టీ సింబల్ ను గొప్పగా చూపిస్తూ ఈ పాటను ప్లాన్ చేసి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అది వేరు. ఇది వేరు. గ్లాస్ మేట్స్ పాటకు జనసేన సింబల్ కు అసలు పోలిక లేదు. ఎందుకంటే ‘చిత్రలహరి’ లో ఉండేది మందుబాబుల చేతిలో ఉండే మత్తిచ్చే గ్లాసు. జనసేన పార్టీ గుర్తేమో బీదా బిక్కీ.. సామాన్యులు అందరూ వాడే టీ గ్లాసు. ఇది మత్తును వదలగొట్టే గ్లాసు.

ఒకవేళ బలవంతంగా పోల్చుదామనుకున్నా మందు గ్లాసు పాట తో ప్రచారం చేస్తే రివర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పాటకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మృగరాజు’లో బాసు స్వయంగా పాడిన ‘ఈ చాయ్ చటుక్కున తాగరా భాయ్’ జనసేన ప్రచారానికి ఎక్కువగా సూట్ అవుతుంది. పాట చాయ్ మీదే అయినా పాటలో ‘జనసేన’ గాజు గ్లాసు ఉంటుంది. అంతే కానీ ‘చిత్రలహరి’ గ్లాసు ఓన్లీ ఫర్ లిక్కర్ గ్యాంగ్.. నాట్ ఫర్ జనసేన!
Please Read Disclaimer