మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్.. కొత్త దర్శకుడితో సాహసం

0

ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయినా సరే.. వరుసగా ఆరు ఫ్లాపులు వస్తే తట్టుకోవడం కష్టం. ఒక దశలో వరుస హిట్లతో పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. ఆ తర్వాత గాడి తప్పాడు. వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ‘ఇంటిలిజెంట’ సినిమా ఫలితమైతే అతడిని కోలుకోకుండా చేసింది. అతడి మార్కెట్ ను పీల్చి పిప్పి చేసేసింది.

‘తేజ్ ఐ లవ్యూ’ కూడా అతడికి ఊరటనివ్వలేదు. ఈ స్థితిలో ఎంతో ఆలోచించి.. ఆచితూచి చేసిన ‘చిత్రలహరి’ తేజుకి కాస్త కుదురుకునే అవకాశమిచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్టయిపోలేదు కానీ.. ఓ మోస్తరుగా ఆడి తేజుకు మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ మారుతితో ‘ప్రతి రోజూ పండగే’ అనే సినిమా చేస్తున్నాడతను.

ఒక ఫ్లాప్ తర్వాత కసిగా పని చేసి ఒక మంచి హిట్టే ఇచ్చే సెంటిమెంటున్న మారుతి.. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడట. ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణ పట్ల టీం అంతా చాలా సంతృప్తిగా ఉందని.. సినిమా హిట్టవడం ఖాయమని అంటున్నారు. మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తేజు కూడా తర్వాతి సినిమా విషయంలో ఒక డేరింగ్ స్టెప్ వేయడానికి సిద్ధమవుతున్నాడట. కెరీర్లో తొలిసారిగా ఒక డెబ్యూ డైరెక్టర్ తో అతను పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు.. సుబ్బు. ‘ఉయ్యాల జంపాల’ ‘మజ్ను’ సినిమాలకు విరించి వర్మ దగ్గర అతను అసిస్టెంటుగా పని చేశాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఆయన ‘మిస్టర్ మజ్ను’తో దెబ్బ తిని ఉన్నారు. కొంచెం వైవిధ్యం ఉన్న కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
Please Read Disclaimer