Templates by BIGtheme NET
Home >> Cinema News >> మాస్కులు అమ్ముతున్న సల్మాన్…!

మాస్కులు అమ్ముతున్న సల్మాన్…!


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్’ పేరిట ముంబై కేంద్రంగా ఓ ఛారిటీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని నిరుపేదలకు.. వికలాంగులకు విద్య మరియు ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసారు సల్మాన్. ఇక ఈ ఫౌండేషన్ లో మంధనా గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా పార్టనర్ గా కొనసాగుతోంది. ‘బీయింగ్ హ్యూమన్ – బ్రాండ్ క్లోతింగ్’ పేరుతో మంధనా గార్మెంట్ ఇండస్ట్రీస్ తయారు చేసిన దుస్తులను విక్రయిస్తున్నారు. డొనేషన్స్ తోనే కాకుండా ఈ ‘బీయింగ్ హ్యూమన్’ దుస్తులు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో కొంత వాటాతో ఈ ఫౌండేషన్ ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ పేరుతో దుస్తులే కాకుండా మాస్కులు కూడా తయారు చేస్తున్నారు.

కాగా కరోనా నేపథ్యంలో మహమ్మారి నుండి జాగ్రత్త పడటానికి మాస్కులు అనేవి ప్రతి ఒక్కరికి కచ్చితంగా అవసరం అవుతున్నాయి. బయటకి వెళ్లాలంటే మాస్కులు ధరించే వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సల్మాన్ ఫేస్ మాస్క్ ధరించిన ఫోటో జత చేస్తూ.. ”బీయింగ్ హ్యూమన్ క్లోతింగ్ నుంచి ఈ రోజు మాస్కులు కూడా లాంచ్ చేస్తున్నాం. ఒక మాస్క్ కొంటే మరొకటి ఫ్రీ గా అందిస్తున్నాం. మాస్కులను బీయింగ్ హ్యూమన్ క్లోతింగ్ స్టోర్ లో కొనండి. మీతో పాటు ఉండే వారికి కూడా మాస్కులు అందించండి. బయటకి వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి వెళ్ళండి. సామాజిక దూరం పాటించండి” అని చెప్పుకొచ్చారు.