సామ్ అండగా ఉండి డబ్బింగ్ చెప్పించిందట

0

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. సీనియర్లు.. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారితో పెట్టుకోవటానికి సుతారం ఇష్టపడరు. వీలైనంత ఇష్యూలను లోగుట్టుగా పరిష్కరించుకోవాలనే భావిస్తారు తప్పించి.. అనవసరంగా బయటకు రావాలని అస్సలు అనుకోరు. ఇది పెద్ద నటుల నుంచి చిన్న వారి వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అలాంటివేళలో.. తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒకప్రముఖుడిపైన మరో ప్రముఖ గాయని ఆరోపణలు చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సాహసానికి తెర తీసి రియల్ హీరోగా నిలిచారు గాయని కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై మీటూ ఆరోపణలు చేసిన చిన్మయి ఉదంతం తమిళ చిత్రపరిశ్రమకు ఒక్క కుదుపునకు గురి చేసింది. ఎప్పటిలానే ఆమె ఆరోపణల వెంటనే ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి కారణం రెన్యువల్ అంటూ సాకు చూపించారు. ఆమె సభ్యత్వాన్ని తిరిగి కొనసాగించాలంటే ఆమె చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకొని రాధారవికి సారీ చెప్పాలన్న డిమాండ్ తెచ్చారు. ఇలాంటి వాటికి ఏ మాత్రం లొంగని చిన్మయి.. కోర్టుకు వెళ్లి తనపై నిషేధానికి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ప్రస్తావనకు కారణం లేకపోలేదు. సమంత నటిస్తున్న ఓ బేబీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంతను చిన్మయి గురించి ప్రశ్నించినంతనే ఆమె తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు.

ఇలాంటి నిజాలు చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని.. చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోందని.. ఎలాంటి తప్పు చేయని వ్యక్తి ఇలాంటి సమస్యలు రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఆమెకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు డబ్బింగ్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా తాను పోరాడుతోందని చెప్పారు. తాను.. నందిని రెడ్డి కలిసి చిన్మయి చేత ఓ బేబీ తమిళ డబ్బింగ్ చెప్పించామంటోంది. ఒకనిజం కోసం పోరాడే వారికి.. అండగా మరో ప్రముఖ నటి నిలవటం మామూలు విషయం కాదు.. అందుకు సమంతకు హేట్సాఫ్ చెప్పాలి. సమంత లాంటి స్నేహితురాలు అందరికి దొరికితే ఎంత బాగుండు!
Please Read Disclaimer