సరిలేరు లుక్: ఈవిల్ ని వేటాడే డెవిల్

0

బార్డర్ లో తుపాకి వేట.. ఊళ్లోకొస్తే గొడ్డలి వేట..! అసలు మహేష్ తీరే వేరుగా ఉంది. సరిలేరు నీకెవ్వరు! నువ్వు వెళ్లేది రహదారి! అంటూ అనీల్ రావిపూడితో కలిసి ప్రయోగమే చేస్తున్నాడు. 2020 సంక్రాంతి టార్గెట్ ఎంచుకుని చిత్రయూనిట్ అంతే వేగం చూపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ చిత్రీకరణను పూర్తి చేశారు. బ్యాలెన్స్ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదివరకూ తొలి సింగిల్ ని మిలటరీ బ్యాక్ డ్రాప్ లో రివీల్ చేశారు. ఆర్మీ మేజర్ లుక్ లో మహేష్ గెటప్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. సరిలేరు పోస్టర్లు కుర్రకారులోకి దూసుకెళ్లిపోయాయి.

తాజాగా దసరా పోస్టర్ ని రిలీజ్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి ఈవిల్ ని వేటాడుతున్న డెవిల్ లా కనిపిస్తున్నాడు మహేష్. ఆర్మీ మేజర్ లుక్ లోనే కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లోనూ. యుద్ధం అనేది కేవలం బార్డర్ లో చేసేదే కాదు. ప్రతి ఊళ్లోనూ యువతరం యుద్ధం చేయాల్సిందే అన్నట్టుగా సందేశం ఇస్తోంది ఈ పోస్టర్. “ఈవిల్ ని నాశనం చెయ్.. సగర్వంగా విజయదశమికి సమర్పిస్తున్నాం“ అంటూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

కాశ్మీర్ నుంచి వచ్చిన సైనికుడికి కర్నూల్లో పనేంటో కాస్త విశదంగా చెబుతారేమో చూడాలి. ఇటీవల కొండారెడ్డి బురుజు దగ్గర భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించింది చిత్రబృందం. ఈ చిత్రం లో విజయశాంతి ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత లేడీ బాస్ రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాక్షన్.. కామెడీ.. సంపూర్ణ వినోదంతో దూకుడు తరహాలో అలరిస్తుందని ఇప్పటికే దర్శకుడు అనీల్ రావిపూడి వెల్లడించారు.