అమ్మ బయోపిక్ ‘శశిలలిత’ ముందు పడేనా?

0

దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో కూడా బయోపీక్ ల సందడి కొనసాగుతుంది. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మాత్రం చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఐరెన్ లేడీ అనే చిత్రం రూపొందుతుండగా ఇటీవలే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ చిత్రం అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సమయంలోనే అమ్మ బయోపిక్ అంటూ ‘శశిలలతిత’ టైటిల్ తో తెలుగు వ్యక్తి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

తాజాగా ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ను విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో జయలలిత మరియు శశికళల మొహాలు సగం సగం ఉండేలా డిజైన్ చేయించాడు. అమ్మ జీవితంను చినప్పటి నుండి చనిపోయే వరకు చూపిస్తానంటూ ప్రకటించిన కేతిరెడ్డి ఈ చిత్రంలో శశికళ పాత్రను ప్రముఖంగా చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. జయలలిత మరణంలో శశికళ పాత్ర ఉందా లేదా అనే విషయాన్ని తాను మాత్రమే చూపించగలను అంటూ గప్పాలు కొడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో జయలలిత పాత్రకు బాలీవుడ్ స్టార్ కాజోల్ ను శశికళ పాత్రకు అమలా పాల్ ను తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కేతిరెడ్డి తెలుగులో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని తీస్తానంటూ ఫస్ట్ లుక్ విడుదల చేయడం నటీనటుల ఎంపిక అంటూ హడావుడి చేసి మీడియాలో మైలేజ్ సంపాదించాడు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో కేతిరెడ్డి మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఇలా హంగామా చేస్తున్నాడా అనేది కొందరి అనుమానం. కాజోల్ అమలాపాల్ వంటి స్టార్స్ ఈయన దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తి చూపుతారా అసలు ఈ చిత్రం ముందు పడుతుందా లేదంటే లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం మాదిరిగానే ప్రకటనల వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.
Please Read Disclaimer