శ్రీదేవీ మరణం వెనుకున్న నిజాల్ని తవ్వి తీశాడు

0

దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితం ఒక ఆదివారం తెల్లవారుజామున అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన వైనం తెలసుకున్న వారంతా షాక్ తిన్నారు. ఊహకు అందని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో యావత్ భారతం నో మాట రాని పరిస్థితి. వీకెండ్ హుషారు ఎగిరిపోయి.. దేశ ప్రజలంతా షాక్ కు గురయ్యారు. బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ బాత్ టబ్ లో నిర్జీవంగా పడి ఉన్న వైనం బయటకు వచ్చినంతనే నోట మాట రాని పరిస్థితి.

ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు.. సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. వాటిల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని విచారణ సంస్థలు తేల్చాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మరణం వెనుకున్న కారణంపై లోతుగా అధ్యయనం చేశారు ప్రముఖ రచయిత సత్యర్థి నాయక్. శ్రీదేవి జీవితం మీద బయోగ్రఫీ రాసిన ఆయన.. శ్రీదేవితో పని చేసిన పలువురు సినీ ప్రముఖుల్ని కలిశారు. వారితో చాలా విషయాలు మాట్లాడిన తర్వాతనే తానీ పుస్తకాన్ని రాశానని చెబుతున్నారు.

ఇంతకీ ఆయన ఏం చెబుతున్నారంటే.. శ్రీదేవి మరణం వెనుక అసలు కారణం లో బీపీ అని తేల్చారు. తాను ఉత్తినే ఆ విషయాన్ని చెప్పటం లేదని.. శ్రీదేవితో కలిసి పని చేసిన పలువురితో మాట్లాడిన తర్వాతే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లుగా తెలిపారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. బంధువులు.. ఆమెతో కలిసి నటించిన పలువురితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని తేల్చినట్లుగా చెబుతున్నారు.

శ్రీదేవికి ముందు నుంచే లో బీపీ ఉందని.. అప్పుడప్పుడు షూటింగ్ లో కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నట్లుగా ఆమెతో నటించిన పలువురు చెప్పినట్లుగా పేర్కొన్నారు. చాల్ బాజ్ చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాషత్ సైతం.. షూటింగ్ వేళలో శ్రీదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా తనతో చెప్పారన్నారు. హీరో నాగార్జున కూడా శ్రీదేవి ఒకసారి షూటింగ్ లో కళ్లు తిరిగి బాత్రూంలో పడిపోయారని గుర్తు చేసుకున్నట్లుగా సత్యర్థి నాయక్ వెల్లడించారు.

శ్రీదేవి కజిన్ మహేశ్వరి సైతం లో బీపీ కారణంగా శ్రీదేవి పడిపోయిందని చెప్పారన్నారు. ఇదే విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ సైతం నిర్దారించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా చూసినప్పుడు లోబీపీ సమస్యతో ఇబ్బంది పడే శ్రీదేవి.. బాత్రూంలో పడిపోయి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా తేల్చారు. లో బీపీ శ్రీదేవి మరణానికి కారణంగా తేల్చారు.
Please Read Disclaimer