సేవ్ నల్లమల అంటున్న శేఖర్ కమ్ముల

0

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తున్నప్పటికీ పర్యావరణవేత్తలు.. ప్రకృతి ప్రేమికులనుండి మాత్రం అభ్యంతరాలు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టడంతో పర్యావరణానికి ముప్పు తప్పదని ప్రభుత్వం నల్లమలను యథాతథ స్థితిలో ఉంచాలని కోరుతూ ‘సేవ్ నల్లమల’ అంటూ ఒక ఉద్యమం ప్రారంభం అయింది.

తాజాగా ఈ ఉద్యమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మద్దతు ప్రకటించారు. కమ్ముల తన ట్విట్టర్ ఖాతా ద్వారా సేవ్ నల్లమల అంటూ ఒక ప్లకార్డ్ పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో పాటుగా ‘నల్లమలలో తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చెంచులు..ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం.. ఇప్పటికే అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం నాశనం అవుతుంది. కృష్ణ..దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలామంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులను.. ఇతర ఆదివాసులను పర్యావరణాన్ని మొత్తంగా నల్లమలను కాపాడాలి” అంటూ ఒక పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ కు చాలామంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. శేఖర్ కమ్ములకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే “ఎక్కడో అమెజాన్ అడవులు తగలబడుతున్నాయని గగ్గోలు పెడతారు.. ఇక్కడ మన నల్లమల అడవుల గురించి ఒక్క ముక్క మాట్లాడరు” అంటూ కొందరు సెలబ్రిటీలకు పరోక్షంగా చురకలు అంటించాడు.
Please Read Disclaimer