అర్జున్ సురవరం రిలీజ్ పై సెల్ఫ్ జోక్!

0

యువ హీరో నిఖిల్.. లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనిదన్’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో నిఖిల్ నటించాడు. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమాకు ఈమధ్యే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాను నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమా విడుదలపై కొన్ని సందేహాలు ఉన్నమాట వాస్తవం. సరిగ్గా ఇదే పాయింట్ తీసుకొని నిఖిల్.. వెన్నెల కిషోర్ ఇద్దరూ ఒక సరదాగా ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో డబ్బింగ్ థియేటర్ నుంచి వెలుపలికి వస్తున్న వెన్నెల కిషోర్ కు నిఖిల్ హాయ్ చెప్తాడు. “డబ్బింగ్ వర్క్ పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ. ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29 న విడుదల అవుతుంది” అని చెప్తాడు. వెన్నెల భయ్యా అదేమీ పట్టించుకోకుండా ఎగాదిగా చూసి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. మరోసారి నిఖిల్ ఆ రిలీజ్ డేట్ గురించి చెప్తాడు. దీంతో విసుగుపుట్టిన వెన్నెల కిషోర్ “ఈ జోక్ ఎన్నిసార్లు వేస్తావయ్యా” అంటాడు.. నిఖిల్ అదే మరోసారి చెప్పడంతో కన్విన్స్ అయ్యి ఆనందభాష్పాలు కారుస్తూ నిఖిల్ ను హత్తుకుంటాడు.

సినిమా విడుదలపై ప్రేక్షకులకు ఉన్న సందేహాలను పోగొట్టడానికి చేసి ఈ వీడియో సరదాగా ఉంది. మీరు ఒకసారి లుక్కేయండి. మరి నిజ్జంగానే ఈ సినిమా నవంబర్ 29 వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈసారికి నమ్మేయండి. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీత దర్శకుడు. తమిళ ఒరిజినల్ దర్శకుడు టీ సంతోష్ ‘అర్జున్ సురవరం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Please Read Disclaimer