చైతూ – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ కంప్లీట్ చేసిన సెన్సిబుల్ డైరెక్టర్..!

0

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’ వంటి సూపర్ హిట్ తర్వాత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ”లవ్ స్టోరీ”. ఇందులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోవిడ్ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారంలో తిరిగి ప్రారంభమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో ఈ చిత్రీకరణ జరిపారు. ఈ రోజుతో ‘లవ్ స్టోరీ’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో శేఖర్ కమ్ముల తో పాటు హీరోయిన్ సాయి పల్లవి – డ్యాన్స్ మాస్టర్ శేఖర్ షూటింగ్ అయిపోయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు.

కాగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావ్ కలిసి ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో త్వరలోనే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న చైతన్య.. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అలానే నటన పరంగా చైతూ కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుతుందని భావిస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల.. చైతన్య ‘లవ్ స్టోరీ’తో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.