సీనియర్ భామల సంపాదన షాడో పెట్టుబడిగా!

0

అందాల కథానాయికల సంపాదన గురించి తెలిసిందే. సౌత్ లో ఇప్పుడున్న సీనియర్ నాయికలు ఒక్కో కమిట్ మెంట్ కి కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. నయనతార 5-6 కోట్లు.. అనుష్క 3కోట్లు.. కాజల్ -త్రిష కోటిన్నర రేంజు పారితోషికాలు ఒక్కో సినిమాకి డిమాండ్ చేస్తున్నారు. వీళ్లంతా దశాబ్ధం పైగా పరిశ్రమలో కొనసాగిన సీనియర్లు. ఒక్కొక్కరు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ సంపాదించారు. దీనికి వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఇలా ఆర్జించిన సంపదను ఏం చేస్తున్నారు? అని ఆరాతీస్తే చాలా ఆసక్తికర సంగతులే తాజాగా రివీలయ్యాయి.

దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి! అన్న చందంగా ఓ వైపు నటిస్తూనే మరోవైపు వేరే ఆదాయ మార్గాల్ని సీనియర్ భామలంతా అన్వేషిస్తున్నారట. ఇంతకుముందు అనుష్క రకరకాల రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక నయన్- త్రిష- శ్రీయ లాంటి భామలు అయితే పూర్తిగా ఔట్ డేటెడ్ అయిపోక ముందే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారట. తమకు ఉన్న పరిచయాల ఆసరాగా ఎంతో నమ్మకస్తులు అయిన వారికి కొంత సొమ్మును ముట్టజెప్పి చిన్న సినిమాలకు పెట్టుబడులు పెట్టిస్తున్నారట. అలాగే సినిమాలకు ఫైనాన్సులు చేయిస్తున్నారని షాడో నేమ్స్ తో వీళ్లంతా అనధికారిక నిర్మాతలు అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అలా పెట్టిన పెట్టుబడులు తిరిగి ఎలా వెనక్కి వస్తాయి? అంటే.. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా సినిమాల్లో షేర్స్ తీసుకోవడం ఏవో కొన్ని ఏరియాల హక్కులు దక్కించుకోవడం వగైరా ఒప్పందాలు చేసుకుంటున్నారట. అయితే అందుకు మధ్యవర్తులు.. నమ్మకస్తుల సాయం ఉంటుంది. కొన్ని చిన్న చిన్న బ్యానర్లు పెట్టించి సదరు భామలు వాటి ద్వారా మనీ పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. మంచి కాన్సెప్టు ఉన్నా.. కథ నచ్చినా .. చిన్న సినిమా బావుంటుంది అనిపించినా వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ తరపున పలువురు భామలు పెట్టుబడులు పెట్టారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద బ్యానర్ ఏది ? అగ్ర నిర్మాత ఎవరు? అన్నది అటుంచితే.. సినిమాల్లోనే సంపాదించి తిరిగి సినిమాల్లోనే పెట్టుబడి పెట్టడం అన్నది హర్షించదగినదే. అయితే ఎలాంటి మోసానికి ఆస్కారం లేకుండా నమ్మకస్తులకు మాత్రమే ఇలాంటి ఛాన్స్ ఇవ్వాలి అని సదరు కథానాయికలకు కొందరు అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.
Please Read Disclaimer