అరే ఈ బంతి గాయం హీరోకి కాదు గీతాధినేతకు!

0

కబీర్ సింగ్` సంచలన విజయంతో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇమేజ్ రెట్టింపైంది. గాళ్స్ లో క్రేజీ హీరోగా వెలిగిపోతున్నాడు. ఆ క్రేజ్ ని అదే ఊపుతో కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీంతో టాలీవుడ్ లో హిట్టు బొమ్మ పడితే ఆ కథల్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ బాలీవుడ్ లో రీమేక్ లో నటిస్తున్నాడు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లోనూ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం చండీఘర్ మొహాలీ స్టేడియంలో షూటింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం ఛండీఘర్ లో షాహిద్ కపూర్ పై క్రికెట్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ లో అపశ్రుతి. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో బౌలర్ విసిరిన బంతి షాహిద్ పెదవులకు బలంగా తాకింది. దీంతో రెండు పెదవులు చిట్లిపోయాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో యూనిట్ వెంటనే స్పందించి హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసి రెండు పెదవులకు కుట్లు వేసినట్లు సమాచారం. డాక్టర్ల సూచన మేరకు కొద్ది రోజుల పాటు షాహిద్ విశ్రాంతి తీసుకోనున్నాడు.

దీంతో భార్య మీరా రాజ్ పుత్ తో కలిసి ముంబైకి తిరుగు పయనం అయ్యాడు. చండీఘర్ ఎయిర్ పోర్టులో షాహిద్ ముఖానికి మాస్క్ ధరించి… భార్యతో కలిసి వస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. షాహిద్ కోలుకునే వరకూ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గాయం వల్ల షూటింగ్ ఆలస్యమైతే ఆ తలనొప్పి నిర్మాతలకే అనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని హిందీలో అల్లు అరవింద్- దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.
Please Read Disclaimer