శేఖర్ కమ్ముల.. మరో కొత్త సర్ ప్రైజ్

0

కొత్త టాలెంట్ ను బయటికి తీయడంలో కొందరు దర్శకులకు ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అలాంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి అతను ఎక్కువగా కొత్త ఆర్టిస్టులు – టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడ్డాక కూడా కమ్ముల ఈ శైలి విడిచిపెట్టలేదు. ఐతే ఏ కొత్త టెక్నీషియన్ తో పని చేసినా వాళ్ల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడం కమ్ములకే సొంతమైన నైపుణ్యం. అతను తరచుగా సంగీత దర్శకుల్ని మార్చడం.. కొత్త వాళ్లతో పని చేయడం మొదట్నుంచి చూస్తూనే ఉన్నాం. తొలి రెండు సినిమాలకు (ఆనంద్ – గోదావరి) రాధాకృష్ణ అనే యువ సంగీత దర్శకుడితో పని చేసిన కమ్ముల.. అతడి నుంచి ఎంత చక్కటి సంగీతం రాబట్టుకున్నాడో తెలిసిందే.

ఆ తర్వాత మిక్కీ జే మేయర్ అనే మరో మ్యూజిక్ సెన్సేషన్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అతను కమ్ములతో చేసిన ‘హ్యాపీ డేస్’ – ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పాటలు సూపర్ హిట్టయ్యాయి. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని ‘ఫిదా’తో రీఎంట్రీ ఇచ్చిన కమ్ముల.. ఆ సినిమాతో శక్తికాంత్ అనే సంగీత దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. అతను ఎంత మంచి పాటలందించాడో తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’ పేరుతో ఓ ప్రేమకథ తీస్తున్న కమ్ముల.. పవన్. సిహెచ్ అనే కొత్త సంగీత దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ పేరు ఇప్పటిదాకా ఎవరూ వినలేదు. ఈ సంగీత దర్శకుడికి ఇదే తొలి సినిమా. కమ్ముల ఛాన్స్ ఇచ్చాడంటే అతను టాలెంటెడే అయ్యుంటాడు. హృద్యమైన ప్రేమకథలా కనిపిస్తున్న ఈ సినిమాలో పాటలు – నేపథ్య సంగీతానికి మంచి ప్రాధాన్యమే ఉంటుంది. మరి కమ్ముల పరిచయం చేస్తున్న ఈ కొత్త సంగీత దర్శకుడు ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.
Please Read Disclaimer