ఓటీటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ డైరెక్టర్ శంకర్…!

0

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయిన అతికొద్ది మంది డైరెక్టర్స్ లో శంకర్ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సందేశాత్మక సినిమాలకి కమర్షియల్ హంగులు జోడించి భారీ స్థాయిలో చిత్రాలను తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అందుకే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆయన సినిమాలో ఒక్కసారి కనిపించినా చాలు అని కోరుకుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ సైతం డైరెక్టర్ శంకర్ తో సినిమాకి డేట్స్ అడిగితే మిగతా సినిమాలు పక్కన పెట్టి మరీ డేట్స్ ఇచ్చేస్తారు. కాగా శంకర్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆయన లోకనాయకుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ శంకర్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేస్తారో లేదో అనే సందిగ్ధంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ చిత్రాలను డైరెక్టుగా ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ ఓటీటీ రిలీజ్ కాలేదు. ఈ విషయంపై దర్శకుడు శంకర్ స్పందించారు. థియేటర్ లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని.. భవిష్యత్తు ఓటీటీదే అయితే నేను సినిమాలు ఎలా తీయాలి అని ప్రశ్నించారు. ఇక సినిమాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఎలాంటి సినిమాలు తీయాలో అర్ధం కావడం లేదని.. థియేటర్ అయినా ఓటీటీ అయినా నా సినిమాలు అన్ని రకాల ఆడియన్స్ ని అలరిస్తాయని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నిర్మాతలకు నష్టాలు రానంతవరకు సినిమాలు ఓటీటీలో విడుదలవడం మంచిదేనని పేర్కొన్నారు.

ఇక శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయాలని అనుకున్నారు శంకర్.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల తేదీ 2022కి మారే అవకాశం ఉంది.
Please Read Disclaimer