రెండు వరుస డిజాస్టర్లు.. జాను అయినా గట్టెక్కిస్తుందా?

0

టాలీవుడ్ లో చాలామంది హీరోలే ఉన్నారు కానీ వారిలో మంచి నటులు మాత్రం తక్కువమందే. అలాంటివారిలో శర్వానంద్ ఒకరు. అయితే శర్వానంద్ ఎంచుకుంటున్న సబ్జెక్టుల వల్లో లేక మరే కారణమో తెలియదు కానీ శర్వానంద్ స్టార్ హీరోల లీగ్ లో మాత్రం స్థానం సంపాదించ లేకపోయాడు. కెరీర్ కూడా ఒక హిట్ అయితే రెండు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది. త్వరలో రిలీజ్ కానున్న ‘జాను’ విజయం శర్వానంద్ కెరీర్ కు కీలకం కానుంది.

శర్వానంద్ నటించిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడిపడి లేచే మనసు’ పై శర్వా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రణరంగం’ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మరీ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ‘రణరంగం’ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ రెండు సినిమాల ఫలితం కొంతవరకూ శర్వా మార్కెట్ ను కూడా దెబ్బతీసింది. దీంతో శర్వా కొత్త సినిమా ‘జాను’ విజయం సాధించడం ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా హీరో శర్వా అయినప్పటికీ సమంతా మెయిన్ అన్నట్టే ప్రొజెక్ట్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయినా శర్వాకు పెద్దగా పేరు రాక పోవచ్చని.. క్రెడిట్ సమంతా ఖాతాలో పడిపోతుందని కూడా టాక్ ఉంది.

ఈ సినిమాకు ప్రమోషన్స్ అంతంతమాత్రంగా ఉండడం ఒక మైనస్ పాయింట్. మరి ఇలాంటి ప్రమోషన్స్ తో ప్రేక్షకులు థియేటర్లకు ఎంతమాత్రం వస్తారో చూడాలి. ఒకవేళ ప్రేక్షకులను ఈ సినిమా కంటెంట్ తెగ నచ్చి.. సినిమా హిట్ అయితే శర్వా ఊపిరి పీల్చుకోవచ్చు. 
Please Read Disclaimer