శృతి రీ ఎంట్రీ: మరోసారి సత్తా చాటగలదా?

0

శృతి హాసన్ తెలుగులో పెద్ద స్టార్ హీరోలతో నటించి కొంతకాలం స్టార్ హీరోయిన్ గానే చెలామణీ అయింది. అయితే ‘కాటమరాయుడు’ తర్వాత మాత్రం బ్రేక్ తీసుకుంది. అప్పటి ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం.. లండన్ లో సింగర్ గా కెరీర్ ఇలా టాలీవుడ్ సినిమాలకు దూరంగా జరిగింది. తెలుగు సినిమాలే కాదు. హిందీ.. తమిళ సినిమాలకు కూడా బై బై చెప్పింది. అయితే మైఖేల్ తో ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడడంతో ఇప్పుడు మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తోంది.

తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమా ‘లాబం’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగులో చాలారోజుల నుండి రీ-ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. ఫైనల్ గా మాస్ మహారాజా కొత్త సినిమా #RT66 లో హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు. గతంలో గోపిచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్ చిత్రం ‘బలుపు’ లో శృతి హాసన్ హీరోయిన్. సేమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తోంది.

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు శృతి హాసన్ ను మరోసారి ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. హీరోల రీ-ఎంట్రీకి హీరోయిన్ల రీ-ఎంట్రీకి తేడా ఉంటుంది. రీ-ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ఎక్కువమందికి విజయం దక్కలేదు. రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ అంటోనీ’ తో గోవా బ్యూటీ ఇలియానా రీ-ఎంట్రీ ఇచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడంతో ఆ సినిమా తర్వాత మరో టాలీవుడ్ ఆఫర్ రాలేదు. ఇప్పుడు శృతికి కూడా అలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు న్యూ జెనరేషన్ హీరోయిన్లు రావడంతో హీరోయిన్లకు కాంపిటీషన్ కూడా పెరిగింది.

మరో విషయం ఏంటంటే.. ‘రేసుగుర్రం’.. ‘శ్రీమంతుడు’ సినిమాల సమయంలో ఉన్నప్పటి గ్లామర్ శృతికి ఇప్పుడు లేదనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరి రవితేజ సినిమాకు శృతి ప్లస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మనం వేచి చూడకతప్పదు.
Please Read Disclaimer