నిశ్శబ్దం: మీట్ మిస్టర్ రిచర్డ్ డికెన్స్

0

అనుష్క శెట్టి.. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ మొదటివారంలో ఈ సినిమా టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇక విడుదలకు నెల మాత్రమే ఉండడంతో ‘నిశ్శబ్దం’ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచుతూ ఉన్నారు.

తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మైఖేల్ మ్యాడ్సెన్ హాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించారు. మైఖేల్ కెరీర్ లో ‘కిల్ బిల్’.. ‘స్పీషీస్’ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. అయన ‘నిశ్శబ్దం’ లో రిచర్డ్ డికెన్స్ అనే పాత్ర పోషిస్తున్నారట. సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పోలీస్ కెప్టెన్ హోదాలో అయన కనిపిస్తారు. అనుష్క కేసుకు సంబంధించిన విచారణ జరిపే అధికారిగా మైఖేల్ కనిపిస్తారట. ఈ పోస్టర్ లో మైఖేల్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. సూటు బూటు ధరించి ఒక కుర్చీలో ఠీవిగా కూర్చున్నారు. ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టుగా గడ్డం కింద చెయ్యిపెట్టుకున్నారు. కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. నేపథ్యం లో చీకటి ఉండడంతో పోస్టర్ డార్క్ స్టైల్ లో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో మైఖేల్ మ్యాడ్సెన్ పాత్ర హైలైట్ గా ఉంటుందనడంలో అనుమానం లేదు.

ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో శాలిని పాండే.. అంజలి.. సుబ్బరాజు.. నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. కోన ఫిలిం కార్పోరేషన్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్.. కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగమతి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘నిశ్శబ్దం’ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Comments are closed.