సూపర్ స్టార్ తో నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. హారర్ జానర్ లో రజినీకాంత్ తొలిసారిగా నటించిన ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహించారు. 2005లో వచ్చిన ఈ సినిమాలో జ్యోతిక నయనతార ప్రభు మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ భాషలో సూపర్ హిట్ అయిన ‘ఆప్తమిత్ర’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ‘చంద్రముఖి’. కాగా కొన్నాళ్ల క్రితమే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందంటూ దర్శకుడు వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రముఖి కి సీక్వెల్ అంటూ తెలుగులో వెంకటేష్ – అనుష్క ప్రధాన పాత్రల్లో ‘నాగవల్లి’ సినిమా రూపొందింది.

ఇదిలా ఉండగా ఇటీవల లారెన్స్ కూడా చంద్రముఖికి కొనసాగింపు భాగం ఉంటుందని.. ఈ చిత్రంలో తాను కూడా యాక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో కొన్నాళ్ల పాటు సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సిమ్రాన్ ఆ తర్వాత ‘సీమ రాజా’ ‘డిటెక్టివ్’ ‘పేట’ సినిమాలలో నటించింది.

ఇంతక ముందు ‘పేట’ సినిమాలో నటించిన రజినీ – సిమ్రాన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఈ వార్తలపై సిమ్రాన్ ట్విట్టర్ లో స్పందించింది. ”ఈ సినిమాలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంలో నా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తున్నాను. ఈ సినిమా ఎటువంటి పాత్ర కోసం కూడా నన్ను ఎవరూ సంప్రదించలేదు. వార్త రాసేముందు ఎవరైనా ఈ విషయంలో క్లారిటీ తీసుకుని రాయండి” అని ట్వీట్ చేసింది. దీంతో సిమ్రాన్ ‘చంద్రముఖి’ సీక్వెల్ లో నటించడం లేదని కన్ఫర్మ్ అయింది.
Please Read Disclaimer