డ్రగ్స్ కేసు : ఎన్సీబీ విచారణకు హాజరైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్…!

0

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ – రకుల్ ప్రీత్ సింగ్ లను మూడు రోజుల్లోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్సీబీ నోటీసులు పంపింది. వీరితో పాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా – దీపికా మేనేజర్ కరిష్మా – సుశాంత్ మేనేజర్ శృతి మోడీలను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా ఈ రోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట హాజరయ్యారు.

కాగా సౌత్ ముంబైలోని కొలాబా ఎన్సీబీ గెస్ట్ హౌస్ కి ఈ రోజు ఉదయం 9:30 గంటల సమయంలో సిమోన్ ఖంబాట్టా చేరుకున్నట్టు జాతీయ మీడియా ఛానల్స్ వెల్లడించాయి. బాలీవుడ్ లోని డ్రగ్స్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. పలువురిని విచారిస్తున్న క్రమంలో సిమోన్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మరియు దీపికా పదుకునే లు రేపు ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరవుతారని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ లను సెప్టెంబర్ 26న ఎన్సీబీ అధికారులు విచారించనున్నారని సమాచారం. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారంపై ఎన్సీబీ అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారని తెలుస్తోంది.