ఎస్పీబీకి ధన నష్టం.. ఆ గుట్టు విప్పాడే!!

0

సినిమాల నిర్మాణం అంటే అందరికీ కలిసి రాదు. నిర్మాత అన్న ట్యాగ్ గొప్పగా ఉన్నా మారిన ట్రెండ్ లో టఫ్ జాబ్ ఇది. గొప్ప సినిమాలు తీసినా లక్ కలిసి రాక ఫ్లాపులు ఎదుర్కొన్నవాళ్లు ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దాదాపు 2500 పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడు చరణ్ పరిస్థితి అదే. అతడు గాయకుడిగా కెరీర్ ని సాగిస్తూనే సినీనిర్మాతగా మారాక తీవ్ర నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. దానిపై తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు.

`వర్షం` చిత్రాన్ని తమిళంలో తీసి కోట్లు పోగొట్టుకున్నారట కదా? అని ప్రశ్నిస్తే.. క్లైమాక్స్ తీసేప్పటికే బిజినెస్ పూర్తయింది. అడ్వాన్సులతోనే పెట్టినదంతా తిరిగొచ్చింది. కానీ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ కోసం బడ్జెట్ ని మించి ఖర్చు చేశాను. అదంతా కొట్టుకుపోయిందని తెలిపారు. అలా పెడుతుంటే వద్దని వారించినా వినకుండా పెట్టానని ఫలితం అనుభవించానని ఎస్పీ చరణ్ నిర్మాతగా తన తొలి అనుభవాన్ని వివరించారు.

“పోగొట్టినవి మీ సొమ్ములా… నాన్నగారివా? అని ప్రశ్నిస్తే.. తొలి సినిమా డబ్బు నాన్నదే. రెండో సినిమాకి నేనే పెట్టాను. బిజినెస్ బాగానే సాగినా.. కొనుక్కున్న వాళ్లు నష్టపోవడంతో రిటన్ ఇచ్చేందుకు నాన్న దగ్గర డబ్బు తీసుకున్నా. మూడో సినిమా తిరిగి పెట్టుబడి తెచ్చింది. ఆ ధైర్యం – ధీమాతో మరో మూడు నిర్మించాను. అవన్నీ తమిళంలోనే. అన్నీ ఫ్లాపులే. పేరొచ్చినా డబ్బులు రాలేదు. అరణ్యకాండ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది“ అని చరణ్ తెలిపారు. ఇన్ని ప్లాపులు తీసిన చెత్త సినిమా చేశావని.. డబ్బు పోగొట్టావని నాన్న ఏనాడూ అనలేదు. అయితే నాన్న డబ్బు పోగొట్టానని ఇప్పటికీ బాధపడుతుంటాను. నాన్నగారికి సారీ చెబుతున్నా.. కానీ ఇలా చెబితే చాలదు! అని కాస్తంత ఎమోషనల్ అయ్యారు చరణ్. పరిశ్రమలో ఎందరో స్టార్లు నిర్మాతలుగా మారి దెబ్బ తిన్నవాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరి అనుభవం ఇతరులకు గుణపాఠం అనే చెప్పాలి.
Please Read Disclaimer