Templates by BIGtheme NET
Home >> Cinema News >> సింగర్ సునీత పేరుతో మోసం చేసేటోడ్ని పట్టుకున్నారు

సింగర్ సునీత పేరుతో మోసం చేసేటోడ్ని పట్టుకున్నారు


రోటీన్ కు భిన్నంగా సింగర్ సునీత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తన పేరుతో పలువురిని మోసగిస్తున్న ఒక వ్యక్తిపై సీరియస్ కావటం తెలిసిందే. తన పేరును తప్పుడా వాడేస్తూ.. అమాయకుల్ని మోసం చేస్తున్న అతగాడు తన కంటికి కనిపిస్తే పళ్లు రాలగొడతానని చెప్పిన ఆమె మాటలు సంచలనంగా మారాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. అతగాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కోరారు. సునీత ఫిర్యాదు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సునీతకున్న ఇమేజ్ ను సొమ్ము చేసుకోవటంలో ఆమె అభిమానుల్ని మోసం చేసిన వైనంపై పోలీసులు జరిపిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అనంతపురం పట్టణానికి చెందిన 22 ఏళ్ల అంకె చైతన్య అలియాస్ చైతూ ఇంటర్ మధ్యలోనే ఆపేసినట్లు గుర్తించారు. పెద్ద గాయకుడు కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ కు వచ్చిన అతడు..కొన్ని పాటలు పాడి మస్తీ మ్యూజిక్ అనే యూట్యుబ్ ఛానె లో అప్ లోడ్ చేశారు. అయితే.. అదేమాత్రం క్లిక్ కాలేదు. దీంతో.. తన ఫేస్ బుక్ పేజీ ఎక్కువమంది ఫాలో అయ్యేలా సింగర్ సునీత పేరుతో మోసాలు చేయటం షురూ చేశాడు.

ఆమెకు తెలీకుండానే ఫిబ్రవరిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన అతడు.. సునీత పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ప్రారంభించాడు. అది నమ్మిన కొందరు సునీత మీద ఉన్న అభిమానంతో సాయం చేయటం షురూ చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోటా సాగుతూ.. సింగర్ సునీత వద్దకు వెళ్లింది. దీంతో.. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైతన్యను అరెస్టు చేశారు. ఇతడి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటికే అతని మీద బుక్కరాయ సముద్రం.. ఆత్మకూరు పోలీసు స్టేషన్లలోనూ కేసులు నమోదైన విషయాన్ని గుర్తించారు.