సిరివెన్నెల -ట్రైలర్ టాక్

0

గతంలో వచ్చి చరిత్రలో నిలిచిపోయిన క్లాసిక్ టైటిల్స్ తో వాటికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగే కథలతో సినిమాలు తీయడం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. గీతాంజలి-శంకరాభరణం లాంటివి ఈ సిరీస్ లో చాలానే వచ్చాయి. కొన్ని సక్సెస్ సాధించగా మరికొన్ని ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ కోవలో వస్తున్న మరో మూవీ సిరివెన్నెల. జూనియర్ ఎన్టీఆర్ యమదొంగలో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత పెద్దగా కనిపించకుండా ఇతర బాషలకు వెళ్ళిపోయిన ప్రియమణి ప్రధాన పాత్రలో మహానటిలో బాల సావిత్రిగా తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన బేబీ సాయి తేజస్విని టైటిల్ రోల్ లో నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేసారు.

కథ విషయానికి వస్తే ఆత్మలపై రీసెర్చ్ చేస్తున్న అభిలాష(ప్రియమణి)కు సిరి(సాయి తేజస్విని)అనే పాప శరీరంలో ఆత్మలు ఉన్నాయని తెలుసుకుని తన గురించి కనుక్కునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే అది అనుకున్నంత సులువుగా జరగదు. ఎన్నో ప్రమాదాలు చుట్టుముడతాయి. సిరి జీవితంలో ఓ దుర్మార్గుడు(కాలకేయ ప్రభాకర్)ఉన్నాడని తెలుస్తుంది. ఈలోగా పాపతో పాటు అభిలాష కూడా ఊహించని సంఘటనలు ఎదురుకుంటారు. ఒకటికి బదులు రెండు ఆత్మలతో తలపడే పరిస్థితి వస్తుంది. చివరికి వీళ్ళ కథ ఏ మలుపులు తిరిగిందో అదే సిరివెన్నెల

కథ మొత్తం పాప పాత్ర వేసిన బేబీ సాయి తేజస్విని చుట్టే తిప్పారు. దెయ్యం లుక్ కోసం వేసిన మేకప్ లోపం కారణంగా కొన్ని షాట్స్ లో అంతగా భయం ఫీలింగ్ ని కలిగించలేకపోయారు. రెండు మూడు షేడ్స్ ని పొందుపరిచినట్టుగా కనిపిస్తోంది. క్లాస్ ప్లస్ మాస్ టచ్ ఉన్న పాత్రలో ప్రియమణికి ఇందులో ఫైట్స్ కూడా పెట్టారు. అజయ్ రత్నం-జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ప్రొడక్షన్ వాల్యూస్ కాస్త తక్కువగా ఉండటం క్వాలిటీ మీద ప్రభావం చూపించింది. ఎడిటింగ్ లోపం వల్ల కాబోలు ట్రైలర్ సైతం కొంత ఖంగాళీ గానే అనిపించింది. కళ్యాణ్ సమీ ఛాయాగ్రహణం ఏఎన్బి కో ఆర్డినేటర్స్ సంయుక్తంగా అందించిన సంగీతం యావరేజ్ గానే ఉన్నాయి. ఓ పాప శరీరంలోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తే అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ హారర్ డ్రామాకు సిరివెన్నెల అనే సాఫ్ట్ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూసాక కానీ క్లారిటీ వచ్చేలా లేదు
Please Read Disclaimer