కలెక్షన్ పోస్టర్లు.. మేమేం తక్కువ అంటున్న చిన్న హీరోలు!

0

సక్సెస్ మీట్ జరపని సినిమాను టాలీవుడ్ లో ఎవరైనా చూపించగలరా? దీనర్థం అన్నీ సినిమాలు సక్సెస్ అయినట్టే కదా. మరి నిర్మాతలకు.. బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్ల కు ఎవరికీ నష్టాలు రావడం లేదా? ఇప్పటికే ఈ సక్సెస్ మీట్లపై తెగ జోకులు వేసుకుంటున్నారు. సక్సెస్ మీట్ల పరిస్థితి ఇలా ఉంటే ఫేక్ కలెక్షన్స్ హంగామా మరోరకంగా ఉంది.

నామమాత్రపు ఓపెనింగ్స్ కూడా రాని సినిమాలకు మొదటి రోజే బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్లు వేస్తున్నారు. మేలురకం 24 క్యారెట్ ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తూ ప్రేక్షకులను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి రోజు నుంచే ఈ హంగామా ప్రారంభం అవుతుంది. అయితే సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది కాబట్టి వీటిలో నిజమెంత అనేది ప్రేక్షకులకు వెంటనే తెలిసిపోతోంది. ఒకవైపు నిర్మాతలు.. హీరోలు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లతో రచ్చ చేస్తుంటే మరోవైపు వాటి రియల్ కలెక్షన్స్ మరునిముషంలో ఆన్లైన్ లోకి వస్తున్నాయి.

అయితే పెద్ద బడ్జెట్లు.. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఈ కలెక్షన్స్ పోస్టర్లు వేస్తున్నారంటే సరేలే అనుకోవచ్చు.. కానీ ఈమధ్య చిన్న సినిమాలకు కూడా ఈ హంగామా మొదలుపెట్టారు. 5 కోట్ల గ్రాస్.. 7 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్లు వేసుకుంటూ ఉండడం కామెడీ అవుతోంది. ఆ గ్రాస్ లో షేర్ సగం కూడా ఉండదు. మరి రెండు మూడు కోట్ల షేర్ కోసం పోస్టర్ లు వేసి బాహుబలి రేంజ్ లో ప్రచారం చేసుకుంటూ ఉండడం నవ్వుల పాలయ్యేలా చేస్తోంది.

100 కోట్ల రేంజ్ సినిమాలకు కలెక్షన్స్ ఫిగర్స్ ప్రచారం చేసుకున్నా అదో తీరు. కానీ ఈ స్థాయి కలెక్షన్లకు పోస్టర్లో నంబర్స్ వేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ హిట్ అయ్యి సినిమా కు లాభాలు వస్తే అప్పుడు ప్రచారం చేసుకోవచ్చు కానీ హిట్టో కాదో తెలియని.. బ్రేకీవెన్ అవుతుందో లేదో తెలియని సినిమాలకు ఈ జాడ్యం అంటుకోవడం విచారకరం. ఇది పెద్ద సినిమాలను చూసి చేస్తున్న పని తప్ప మరొకటి కాదని.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని సోషల్ మీడియాలో ఈ కలెక్షన్ పోస్టర్లపై సెటైర్లు పడుతున్నాయి.
Please Read Disclaimer