సోనూ సూద్.. ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడు

0

బాలీవుడ్ చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. ఐతే లాక్ డౌన్ టైంలో ఆ సూపర్ స్టార్లందరినీ మించిన సూపర్ స్టార్ అయిపోయాడు సోనూ సూద్. నటుడిగా అతడిది మీడియం రేంజే కానీ.. మంచి మనసులో అతడి ముందు ఎవరూ నిలవజాలరని తెలియజెప్పాడతను. హెల్త్ వర్కర్ల కోసం తన హోటల్ను ఉచితంగా నడిపించడం మొదలుపెట్టి.. లాక్ డౌన్ టైంలో అతను చేసిన సేవ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తట్టా బుట్టా చేత బట్టుకుని.. పిల్లల్ని నడిపించుకుంటూ వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికుల్ని చూసి అందరి గుండెలు తరుక్కుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ప్రభుత్వాలు వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తే.. సోనూ సూద్ ముందుకొచ్చి వేలాది మందికి ప్రయాణ ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు చేర్చాడు.

రెండు నెలల కిందట్నుంచి ఇది ఒక ఉద్యమం లాగా నడుస్తోంది. దీని కోసం అతను ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశాడు. దాని కోసం కోట్లు ఖర్చు పెట్టాడు. తన సేవింగ్స్ అన్నింటినీ తీసి ఖర్చు పెట్టేశాడు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమేర ప్రభుత్వ సాయం కూడా తీసుకుని ఇప్పటికీ అతను వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపే పనిని కొనసాగిస్తుండటం విశేషం. తన టీంకు ఇప్పటికీ వందల మంది ఫోన్లు చేసి ఇళ్లకు పంపించమని అడుగుతున్నట్లు తాజాగా సోనూ వెల్లడించాడు. ముంబయిలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడే పరిస్థితి లేకపోవడం ఆంక్షలు కొనసాగుతుండటం పనులు లేకపోవడంతో కార్మికుల నుంచి ఫోన్లు ఆగట్లేదని సోనూ చెప్పాడు. ఇంకో విశేషం ఏంటంటే.. సోనూ వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా.. స్వస్థలాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపాక మళ్లీ పనుల కోసం ముంబయి సహా కొన్ని నగరాలకు తిరిగి రావాలని చూస్తున్నారు కార్మికులు. వాళ్ల నుంచి సోనూ టీంకు కాల్స్ వస్తుండటంతో.. తాము పంపిన బస్సుల్లో వారిని వెనక్కి తీసుకొచ్చే పని కూడా జరుగుతోంది. చూస్తుంటే ఈ ఏడాదంతా సోనూ ఈ పనిలోనే మునిగిపోయేట్లున్నాడు. అలుపు సొలుపు లేకుండా కోట్లు ఖర్చు పెట్టి ఈ యజ్ఞాన్ని నడిపిస్తున్న సోనూకు సెల్యూట్ చేయాల్సిందే.
Please Read Disclaimer