బాలు ఇంటి ముందు భావోద్వేగంతో కుప్పకూలిన అభిమాని

0

పరిచయం అవసరం లేని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యనికి అభిమానులు తెలుగు నేల మీదనే కాదు.. తమిళనాడుతో సహా దక్షిణాది మొత్తం ఆయన సుపరిచితుడు. ఆ మాటకు వస్తే.. హిందీలోనూ చాలానే పాటలు పాడారు. దేశంలోని పదహారు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తమిళులు అయితే.. ఆయన్ను తెలుగువాడిగా అస్సలు భావించరు. తమలో ఒకరుగానే అనుకుంటారు. అంతలా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒక గాయకుడు మరణిస్తే.. వేలాదిగా ఇంటికి పోటెత్తటం బాలుకు మాత్రమే సాధ్యమవుతుందేమో? ఎవరిని రావొద్దని చెప్పినా.. వెల్లువలా ఆయన్ను చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన సింగర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కించుకున్న ఆయన్ను చూసేందుకు వచ్చిన తమిళ అభిమాని భావోద్వేగంతో కుప్పకూలిన ఉదంతం చోటు చేసుకుంది.

ఎస్పీ ఇంటి వద్దకు వచ్చిన సదరు తమిళ అభిమాని.. ఆయన పాటల్ని పాడారు. తీవ్రమైన భావోద్వేగంతో అతడు కుప్పకూలాడు. యాభై రోజుల పాటు చెన్నైలోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఆయన కరోనాను జయించినా.. మిగిలిన ఆరోగ్య సమస్యల్ని అధిగమించలేకపోవటం తెలిసిందే. బాలు ఇంటి ముందు కుప్పకూలిన అభిమాని క్షేమంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అతనికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపినట్లుగా తెలుస్తోంది.