బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీకి రాకపోవడంపై చిన్నల్లుడి స్పందన

0

నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ వారసులుగా ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బాలకృష్ణ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ముందు ముందు నందమూరి ఫ్యామిలీ నుండి ఎంతో మంది కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. కాని ఇప్పటి వరకు హీరోయిన్స్ గా మాత్రం ఎవరు తెరపై కనిపించలేదు. బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు కూడా చాలా అందంగా హీరోయిన్స్ కావాల్సిన ఫీచర్స్ ను కలిగి ఉంటారు. కాని వారిద్దరిని కూడా బాలయ్య ఇండస్ట్రీకి తీసుకు రాలేదు. ఇప్పటికే ఇద్దరి పెళ్లిలు అయ్యాయి.. ఇద్దరు తల్లులు కూడా అయ్యారు.

ఈ సమయంలో వారు సినిమాల్లోకి రాకపోవడంపై చర్చ మొదలైంది. తాజాగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి భర్త భరత్ టీవీ9 జాఫర్ కు ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలపై మాట్లాడిన భరత్ తో చివర్లో సినిమా విషయాలను కూడా జాఫర్ మాట్లాడించాడు. ఆ సమయంలో తేజస్వి మరియు బ్రహ్మణిలు ఇండస్ట్రీలోకి రాకపోవడంకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు.. ఈ విషయం గురించి బాలకృష్ణ గారితో ఎప్పుడైనా చర్చించారా అంటూ ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు సమాధానంగా భరత్ మాట్లాడుతూ.. తెలుగు సొసైటీలో అమ్మాయిలను ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడం అప్పట్లో చాలా తక్కువ. ప్రస్తుతం మార్పులు వచ్చి మంచు వారి అమ్మాయి లక్ష్మి.. నాగబాబు గారి కూతురు నిహారికలు నటిస్తున్నారు. బ్రహ్మణి మరియు తేజస్విలు అందంగా ఉంటారు.. వారిలో మంచి నటన ప్రతిభ ఉంది. కాని వారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన చేయలేదు అన్నాడు. తేజస్వికి సినిమాలంటే చాలా ఆసక్తి. ఆమె బయట అప్పుడప్పుడు యాక్టింగ్ చేయడం.. డాన్స్ చేయడం చూస్తుంటే హీరోయిన్ అయ్యి ఉంటే మంచి సక్సెస్ అయ్యేదనిపిస్తుంది. మామయ్యను ఎప్పుడు కూడా వారిని హీరోయిన్స్ గా ఎందుకు పరిచయం చేయలేదని అడగలేదు. కాని తేజస్విని అడిగినప్పుడు మాత్రం సినిమాలంటే ఆసక్తే కాని నటించాలనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు.. ఆ దిశగా మమ్ములను ఎవరు ప్రోత్సహించలేదని చెప్పిందన్నాడు.

బ్రహ్మణికి నటన అంటే అంతగా ఆసక్తి ఉన్నట్లుగా అనిపించదు. ఆమె ఎక్కువగా వ్యాపారాలు.. చదువులు అంటూ అలా వెళ్లిందన్నాడు. భవిష్యత్తులో తేజస్వి ప్రొడక్షన్స్ లోకి వెళ్లే అవకాశం ఉందని అప్పుడు ఆమె మామయ్యతో కూడా సినిమా చేస్తుందేమో అన్నాడు. ఆమెకు నేను ఎప్పుడు హద్దులు పెట్టను. ఆమె చేయాలనుకున్నది స్వేచ్చగా చేసే వీలు కల్పిస్తానన్నాడు. మొత్తానికి బాలయ్య చిన్న కూతురు భవిష్యత్తులో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలున్నాయని స్వయంగా ఆమె భర్త భరత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం చిన్న పిల్లాడి తల్లి అవ్వడం వల్ల సినిమాలకు మరింత సమయం తీసుకుని ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer