గీతా ఆర్ట్స్ 2 లో యంగ్ హీరో జాక్ పాట్

0

అప్పట్లో ఒకడుండే వాడు .. నీది నాదీ ఒకటే కథ .. ఇలాంటి విభిన్నమైన ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నాడు యువహీరో శ్రీవిష్ణు. హీరో నారా రోహిత్ కి క్లోజ్ బడ్డీ. ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరు అన్న సంగతి తెలిసిందే. రోహిత్ నటించే సినిమాల్లో అతడికి ఓ పాత్ర ఉంటుంది. నటించిన ప్రతి సినిమాలో ఎమోషనల్ కంటెంట్ తో మెప్పించే సత్తా ఉన్న పెర్ఫామర్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. బ్యాచిలర్ లైఫ్ లో మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ గురించి అతడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అదే ఎమోషన్ తన నటనలోనూ కనిపిస్తోంది.

ఇటీవలే `బ్రోచేవారెవరురా` చిత్రంతో మరో విజయం అందుకుని జోష్ లో ఉన్నాడు ఈ నవతరం హీరో. చక్కని అభిరుచి ఉన్న కథల్ని ఎంచుకునే హీరోగానూ అతడికి పేరొచ్చింది. బ్రోచేవారెవరురా సినిమాలో శ్రీవిష్ణు లోని కామెడీ యాంగిల్ కి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పలువురు నవతరం దర్శకుల సినిమాల్లో నటించేందుకు అతడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం.. ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ 2లో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి `పేపర్ బోయ్` ఫేం జయశంకర్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్ 2 అంటే నవతరం హీరోలతో పరిమిత బడ్జెట్ చిత్రాల్ని నిర్మించి బ్లాక్ బస్టర్లు కొడుతూ దూసుకుపోతున్న బ్యానర్. బాస్ అల్లు అరవింద్ పర్యవేక్షణలో బన్ని వాసు ఈ సంస్థ వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. 100 పర్సంట్ లవ్ తో నాగచైతన్యకు బ్లాక్ బస్టర్ అందించారు. ఆ తర్వాత చైతూ కెరీర్ గురించి తెలిసిందే. అలాగే `గీత గోవిందం` చిత్రంతో విజయ్ దేవరకొండకు మంచి లైఫ్ నిచ్చిన బ్యానర్. కెరీర్ లో అరడజను సినిమాలకే 100 కోట్ల క్లబ్ హీరోగా దేవరకొండ పేరు మార్మోగింది అంటే అది గీతా ఆర్ట్స్ 2 చలువే. పలువురు నవతరం దర్శకులకు గీతా ఆర్ట్స్ అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తోంది. హీరో శ్రీవిష్ణు కెరీర్ కి జీఏ2 ఛాన్స్ ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. `పేపర్ బోయ్` లాంటి రొమాంటిక్ కామెడీని తెరకెక్కించిన జయశంకర్ శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథాంశాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer