ఎన్టీఆర్ హెల్ప్ వార్తలపై శ్రీహరి తనయుడు క్లారిటీ

0

దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. లక్ష్య ప్రొడక్షన్స్ లో రూపొందిన ‘రాజ్ దూత్’ అనే చిత్రంతో మేఘాంశ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న రాజ్ దూత్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేఘాంశ్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఈ సందర్బంగా మేఘాంశ్ మాట్లాడుతూ… నాన్నకు అన్నయ్య నేను సినిమాల్లోకి రావాలనేది కోరిక. ఆయన కోరిక మేరకు నేను హీరోగా అన్నయ్య డైరెక్టర్ గా రాణించాలని కోరుకుంటున్నాం. మేం ఏం చేసినా కూడా నాన్న పేరు నిలబడే విధంగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఎక్కడ కూడా ఆయనకు చెడ్డ పేరు రాకుండా చూస్తాం. నాన్న ఇప్పుడు ఉంటే చాలా బాగుండేది. నా సినిమా ప్రతి షాట్ ను కూడా దగ్గరుండి చూసేవాడు. సలహాలు సూచనలు ఇచ్చే వాడు. డాడీని మిస్ అవుతున్నా. డాడీ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి రోజూ మాతో అన్ని విషయాలను మాట్లాడేవాడు. మాకు అన్ని విధాలుగా ప్రోత్సాహంనిచ్చేవారు.

ప్రస్తుతం అన్నయ్య షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాలని చూస్తున్నాడు. ఇక నేను ‘రాజ్ దూత్’ సినిమా షూటింగ్ ప్రారంభంకు కొన్ని రోజుల ముందు యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. డాన్స్ మరియు బాక్సింగ్ అనేది చిన్నప్పటి నుండి టచ్ లోనే ఉందన్నాడు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే రాజస్థాన్ లో ఒక బండికి గుడి కట్టారట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రంను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా కథ మొత్తం ఒక బండి చుట్టు తిరుగుతుందని అన్నాడు. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంను మేఘాంశ్ వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి మేఘాంశ్ క్లారిటీ ఇచ్చాడు. ఆడియో విడుదల కార్యక్రమంలో నేను మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ సాయం చేశాడని చెప్పానంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఆరోజు నేనసలు ఆ విషయం మాట్లాడలేదు. మరి ఎందుకు అలా రాశారో నాకు తెలియదు. అయితే నా ఫేవరేట్ హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఉంటాడని మేఘాంశ్ క్లారిటీ ఇచ్చాడు.
Please Read Disclaimer