మీసం మార్కెట్లో తిప్పు.. ఇక్కడ కాదు!

0

కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ వైవిధ్యం కోసం తపిస్తున్న హీరోగా శ్రీవిష్ణు పేరు పాపులరైంది. అప్పట్లో ఒకడుండేవాడు- నీది నాది ఒకే కథ-మెంటల్ మదిలో ఇలా ప్రతిదీ దేనికదే విలక్షణంగా ఉండే కథల్ని ఎంచుకున్నాడు. ఇటీవలే నివేద థామస్ తో కలిసి ‘బ్రోచేవారెవరురా’ అంటూ శ్రీవిష్ణు చేసిన సందడి తెలిసిందే. కెరీర్ లో క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచింది. బంపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు అంటూ లేకపోయినా తనకంటూ ఒక దారి ఉందని నిరూపించాడు.

అందుకే శ్రీవిష్ణు ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే యువతరంలో చర్చకు వస్తోంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. నేటితరం ర్యాప్ పాప్ రేంజు కుర్రాడికి ఏమాత్రం తగ్గడు అన్నట్టుగానే ఉంది తాజాగా రిలీజైన పోస్టర్. ఇందులో శ్రీవిష్ణు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ రచ్చ లేపుతున్నాడు. అన్నట్టు ఆ మెడలో ఏసుక్రీస్తు శిలువను రుద్రాక్ష తాడుకు ఎందుకు కట్టినట్టు? ఆ చేతికి ఆ కంకణాలేమిటి? ఇవన్నీ ఏదో ఫజిల్ లానే అనిపిస్తోంది. చెరిగిన జుత్తు.. గుబురు గడ్డం.. మెలితిరిగిన మీసం ఏమిటో ఈ కుర్రాడి కథ. ఇంతకీ శ్రీవిష్ణు ఎందుకు మీసం తిప్పుతున్నట్టు? .. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తొందర్లోనే తేలాల్సి ఉంది. కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సిద్ వర్క్ చేయనున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ – శ్రీ ఓం సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు .. ఈ సినిమాకి ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. ‘తిప్పరా మీసం’ తెలుగు రాష్ట్రాల హక్కుల్ని ఆయన రూ.2.50కోట్లకు చేజిక్కించుకున్నారు. కర్నాటక- ఇతర భారత దేశం బిజినెస్ రూపంలో మరో రూ.75లక్షలు దక్కిందని తెలుస్తోంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 1.75కోట్లు పలికింది. శాటిలైట్ -డిజిటల్ రూపంలో మరో 2.5 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఇదేమీ ఆషామాషీ కాదు. రూ.7కోట్ల నుంచి 10 కోట్ల మేర బిజినెస్ అంటే ఫర్వాలేదనే అర్థం. శ్రీవిష్ణు నెమ్మదిగా మార్కెట్ పై గ్రిప్ పెంచుకుంటున్నాడనే దీనిని బట్టి అర్థమవుతోంది. నవంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer