చిట్ట చివరి ప్రయత్నం అక్కడేనా?

0

పోటీ ప్రపంచంలో ఫేడవుట్ అనే పదం రెగ్యులర్ గా వినేదే. టాలీవుడ్ లో అగ్ర కథానాయికలుగా ఏలిన భామలు ఏదో ఒక రోజు ఫేడవుట్ అవ్వక తప్పదు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్లుగా పాపులరైన త్రిష.. కాజల్.. తమన్నా వీళ్లంతా కెరీర్ పరంగా చరమాంకంలోనే ఉన్నారని అర్థమవుతోంది. ఫేడవుట్ కేటగిరీలో పడిపోక ముందే ఏదైనా చేయాలనే తపనలోనూ ఉన్నారు ఈ ముగ్గురూ.

వెల్లువలా దూసుకొస్తున్న యువ కథానాయికల హవా ముందు తమని తాము కాపాడుకునేందుకు నిరంతరం ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందేనని ఈ భామలు అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే పూర్తిగా క్రేజు మసకబారక ముందే ఆల్టర్ నేట్ ఆప్షన్స్ వెతుకుతున్నారట. ఇప్పటికే కాజల్ – తమన్నా ఇద్దరూ వెబ్ సిరీస్ బాట పట్టారు. దాంతో పాటే ఇరుగు పొరుగు భాషల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు- తమిళంలో అవకాశాలు తగ్గడంతో కన్నడ-మలయాళం వైపు ఓ చూపు చూస్తున్నారు. కాజల్ -తమన్నా బాటలోనే త్రిష వెబ్ సిరీస్ అవకాశాల్ని పరిశీలిస్తోందట.

త్రిష ఇప్పటికే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన నటించి విజయం అందుకుంది. అయితే తిరిగి 96 సక్సెస్ తో తమిళంలో బిజీ అయ్యి కన్నడ రంగంలో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. ఏమాత్రం సీన్ మారినా మరోసారి కన్నడంలో నటించేందుకు ఆస్కారం ఉంది. ఇక తాజాగా అందాల చందమామ కాజల్ .. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన కబ్జా అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. చందమామ ఇమేజ్ కి భిన్నమైన పాత్రలో ఛాన్స్ వచ్చినా అంగీకరించిందట. తెలుగు తమిళం సహా హిందీ పరిశ్రమలో మూడు ముక్కలాట ఆడిన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెరీర్ గ్రాఫ్ నెమ్మదిస్తోంది. ఆ క్రమంలోనే కేజీఎఫ్ లో ఐటెమ్ నంబర్ తో కన్నడిగులకు పరిచయమైంది. ఆ తర్వాత కన్నడ రంగంలో అవకాశాలు వెల్లువెత్తినా కాదందిట. అయితే ఇప్పుడు సీన్ మారుతున్న కొద్దీ కన్నడ -మలయాళ పరిశ్రమల వైపు దృష్టి సారిస్తోందట. స్టార్ హీరోయిన్లు ఇరుగు పొరుగు భాషలకు వెళ్లారంటే అదే చిట్ట చివరి ఆప్షన్ అని అర్థం. ముఖ్యంగా టాలీవుడ్ కోలీవుడ్ లో కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుని ఇప్పుడు లక్షల్లో పారితోషికాలకే పొరుగు పరిశ్రమలకు వెళుతున్నారంటే అందుకు కారణాన్ని ఈజీగానే కనిపెట్టేస్తున్నారు ఫ్యాన్స్.
Please Read Disclaimer