ఆ షోకు సుమ గుడ్ బై..!

0యాంకర్ సుమను తమ ఇంటి అమ్మాయిగా ఆదరించి.. అభిమానించే వారు చాలామందే ఉంటారు. తెలుగునాట కొందరిళ్లలో సుమ వారి కుటుంబ సభ్యురాలిగా ఫీలయ్యే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగునాట యాంకర్లకు కొదవ లేకున్నా.. అక్కడెక్కడో కేరళలో పుట్టి.. పెరిగిన ఆమె తెలుగును నేర్చుకోవటమే కాదు.. తెలుగువారి తలలో నాలుకగా మారింది.

సుమకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణంగా ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళగా చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. సరిగ్గా భోజనాల వేళ వచ్చే ఈ కార్యక్రమాన్ని ఇంటిల్లిపాది చూడటం.. భోజనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేసే ఇళ్లు తెలుగు లోగిళ్లలో చాలానే ఉంటాయి.

అలాంటి స్టార్ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పుష్కర కాలం అదేనండి పన్నెండేళ్ల పాటు సాగింది. మొత్తంగా మూడు వేల ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆ మధ్యన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కేసింది. ఇంత సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు సుమ స్వయంగా పేర్కొంది.

ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఈకార్యక్రమం మీద అభిప్రాయాల్ని వీడియోల రూపంలో పంపితే ప్రసారం చేస్తామని సుమ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. నిత్యం సందడి చేసే స్టార్ మహిళకు గుడ్ బై చెప్పటం అంటే.. సుమ పాక్షికంగా రిటైర్ అయినట్లేనని చెబుతున్నారు. ఊపిరి పీల్చుకోనంత బిజీ షెడ్యూల్ తో పని చేసిన సుమ.. కాస్త ఫ్రీ కావాలనుకోవటం తప్పేం కాదులెండి.