ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి మాస్టారూ..!

0

తమిళ అగ్ర కథానాయకుడు ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ”మాస్టర్”. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా.. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ సినిమా తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అలానే ‘తుపాకి’ ‘సర్కార్’ ‘పోలీసోడు’ ‘విజిల్’ ‘అదిరింది’ వంటి సినిమాలతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ‘మాస్టర్’ సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా తెలుగు రైట్స్ నిర్మాత కోనేరు మహేష్ సుమారు 7 కోట్లకి తీసుకున్నట్లు టాక్. కరోనా లేని టైమ్ లో అయితే ఇది సేఫ్ గేమ్ అనే చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు కరోనా నేపథ్యంలో మాత్రం చాలా రిస్క్ అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ‘మాస్టర్’ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేస్తారని.. ఆ తర్వాత దీపావళికి రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే దసరా పోయింది.. దీపావళి దగ్గర పడింది. కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. అభిమానులు మాత్రం కనీసం టీజర్ రిలీజ్ చేసైనా బజ్ క్రియేట్ చేయాలని.. విడుదల వేదిక విషయంలో క్లారిటీ ఇవ్వమని కోరుతున్నారు. దీపావళి నుంచి తమిళనాడులో థియేటర్లు రీ ఓపెన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసినా ఆడియెన్స్ పెద్దగా రాకపోవచ్చు. మరి దీని కోసం మేకర్స్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారేమో చూడాలి. ఏదేమైనా ‘మాస్టర్’ సినిమాతో తెలుగు మార్కెట్ పై పాగా వేయాలని ఆశపడిన విజయ్ కి కరోనా దెబ్బ కొట్టిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.