మొన్న రౌడీ.. నిన్న మహేష్ .. నేడు బన్నినా?

0

డిజైనర్ దుస్తుల వ్యాపారంలో బాలీవుడ్ స్టార్లు రాణిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్.. సోనమ్ కపూర్ వంటి స్టార్లు సొంత బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశ పెట్టి భారీగా ఆర్జిస్తున్నారు. వీళ్లు కేవలం బ్రాండ్ పబ్లిసిటీ కే పరిమితం కుకుండా పెట్టుబడులు పెడుతూ ప్రాచుర్యం తెస్తున్నారు. వెనక నుంచి ఓ పెద్ద మార్కెటింగ్ టీమ్ బంధు మిత్రులు ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇ- పోర్టళ్ల రాకతో వ్యాపారం అంతకంతకు సులువుగా మారడం స్టార్లు ఈ రంగంలో ఆసక్తి చూపించడానికి కారణమని ప్రచారమవుతోంది. ఆన్ లైన్ లో వస్త్ర వ్యాపారం వెలుగుతోందన్న సర్వే కూడా ఉంది.

అయితే సరిగ్గా ఇదే పాయింట్ మన టాలీవుడ్ స్టార్ హీరోల్ని ఆకర్షిస్తోందని తాజా సన్నివేశం చెబుతోంది. ఇదివరకూ కేవలం బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కేవలం అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించేవారు. అందుకోసం కార్పొరెట్ కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకునేవారు. కోట్లలో పారితోషికాలు ముట్టేవి. కానీ ఇప్పుడలా కాదు.. కార్పొరెట్ బ్రాండ్లతో జతకట్టి పెట్టుబడులు వెదజల్లుతూ వ్యాపారంలోకి నేరుగా దిగిపోతున్నారు.

ప్రస్తుతం వస్త్ర వ్యాపారంపై టాలీవుడ్ స్టార్ల కన్న పడిందని అర్థమవుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ.. మహేష్ ఈ రంగంలో అడుగు పెట్టారు. ఇప్పటికే దేవరకొండ `రౌడీ వేర్` బ్రాండ్ పాపులరైంది. వేరొక వస్త్ర దుకాణ సముదాయం(రిటైల్ నెట్ వర్క్) తో దేవరకొండ ఒప్పందం చేసుకున్నారని ప్రచారమైంది. అలాగే తాజాగా సూపర్ స్టార్ మహేష్ `హంబుల్` పేరుతో సొంత డిజైనర్ బ్రాండ్ ని ప్రారంభిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన పోస్టర్లు అధికారికంగా రివీల్ చేశారు. వీళ్లతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం వస్త్ర వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తోంది. ఆయన స్టార్ (ST`AA`R) పేరుతో ఓ బ్రాండ్ ని మార్కెట్లోకి తేనున్నారట. ప్రస్తుతం ST`AA`R పేరుతో ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజైంది. ఆగస్టు నుంచి బన్నీ బ్రాండ్ దుస్తులు మార్కెట్లోకి దిగుతున్నాయని ప్రచారమవుతోంది. ఈ ప్రచారం ఇప్పుడే వచ్చినది కాదు. గత కొంత కాలంగా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోనూ ఉంది. అయితే దీనిపై బన్ని పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ.. మహేష్.. బన్ని ఇలా హీరోలంతా బరిలో దిగుతున్నారు. మునుముందు ఎన్టీఆర్.. చరణ్.. ప్రభాస్ సైతం సొంతంగా డిజైనర్ దుస్తుల వ్యాపారంలోకి దిగుతారేమో? చూడాలి. ఇకపోతే స్టార్ల క్రేజును ఉపయోగించుకుని ఒక బ్రాండ్ ని పాపులర్ చేయడం ద్వారా అభిమానులకు గాలం వేస్తున్నారా? అందుకే స్టార్లతో సదరు బ్రాండ్లు ఇలా టై- అప్ లు పెట్టుకుంటున్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. కేవలం ఇదో తరహా బ్రాండ్ పార్టనర్ వ్యవహారమా? లేక ఇరు వర్గాలు 50-50 పెట్టుబడులతో ముందుకెళుతున్నారా? అన్నదానిపైనా అసలు సంగతి రివీల్ కావాల్సి ఉంది.
Please Read Disclaimer