మరో సినిమా తో వారిని కూడా మెప్పిస్తా: సుడిగాలి సుధీర్

0

కమెడియన్లు హీరోలుగా మారడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. అదేమీ కొత్త కాదు. అయితే అప్పట్లో స్టార్ కమెడియన్లు మాత్రమే హీరోలుగా సినిమాలు చేసేవారు. ఇప్పుడు కమెడియన్ గా జనాల్లో కొంచెం గుర్తింపు తెచ్చుకుంటే చాలు హీరోలుగా మారిపోతున్నారు. అయితే వీరిలో మెజారిటీ కమెడియన్స్ ప్రేక్షకులను మెప్పించలేక చతికిల పడుతున్నారు. రీసెంట్ గా సుడిగాలి సుధీర్ సినిమాకు అదే జరిగింది.

సుడిగాలి సుధీర్ ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమా తో హీరోగా తన అదృష్టం పరిక్షించుకున్నాడు. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రాక తో పెద్ద హీరోల సినిమాలనే ప్రేక్షకులు సరిగా పట్టించుకోవడం లేదు. ఇక చిన్న సినిమాల సంగతి నానాటికి తీసికట్టు అన్నట్టుగా ఉంది. సినిమాలో కంటెంట్ అద్భుతమైతే తప్ప ఆ సినిమాను చూసేందుకు ఎవరూ టికెట్ పై ఖర్చుపెట్టేందుకు రెడీగా లేరు. ఇలాంటి సమయంలో రోటీన్ ఫార్మాట్ లో.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ను ఎవరు పట్టించుకుంటారు? ప్రేక్షకులే కాదు.. రివ్యూయర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వచ్చిన ఒకటి అరా రివ్యూలలో ఈ సినిమా సుడిగాలి సుధీర్ అభిమానులకు ఓకే కానీ మిగతా వారు చూడడం కష్టమే అనే అభిప్రాయం వెలిబుచ్చారు.

ఈ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా సుడిగాలి సుధీర్ మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ప్రేక్షకులకు నచ్చిందని అంటున్నాడు. అయితే కొందరికి ఈ సినిమా నచ్చి ఉండకపోవచ్చని.. ఈసారి మరింతగా కష్టపడి వారిని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు.
Please Read Disclaimer