మెగా రీమేక్ అలా అటకెక్కినట్టేనా?

0

ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసీఫర్’ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేరే ఎక్కువగా వినిపించింది. ఆ బాధ్యతల్ని విలక్షణ దర్శకుడు సుకుమార్ కు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని చరణ్- సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా సుక్కూ ఆసక్తి కనబరచ లేదని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి.

దీంతో చిరంజీవి కూడా కొన్నాళ్ల పాటు ఆ ప్రాజెక్ట్ ను ఆపేద్దామని చెప్పారట. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటివరకూ రీమేక్ కథలు డైరెక్ట్ చేసింది లేదు. ఆయన సొంతంగా కథలు రాసుకుని సినిమాలు చేస్తారు. రొటీన్ కి భిన్నంగా ఉండే దర్శకుడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి తీసుకున్నా మనదైన నేటివిటీని మిస్ చేయడు. సహజంగానే సొంతగా కథలు రాసుకునే సత్తా ఉన్న దర్శకులు ఎవరూ ఇలా రీమేక్ ల వైపు పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలో దొరికిన సంతృప్తి… రీమేక్ కథల్లో దొరకదని బలంగా నమ్మే వాళ్లలో సుకుమార్ ఒకరు. ఈ కారణాలే లూసీఫర్ రీమేక్ పై వెనక్కి తగ్గేలా చేశాయట.

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ చిత్రంతో బిజీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్ పేనే సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.’సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న సోషియో పొలిటికల్ డ్రామా చిత్రమిది.
Please Read Disclaimer