అభిమాని కోలుకోవాలని సీనియర్ సినీనటుడి పూజలు!

0

చాలా అరుదుగా చోటు చేసుకునే ఘటనగా దీన్ని చెప్పాలి. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకునే రాజకీయ.. సినీ రంగ ప్రముఖులతో పాటు.. సెలబ్రిటీలకు ఏదైనా అనారోగ్యానికి గురైతే.. వారి కోసం సామాన్యులు ఆందోళన చెందటం రోటీన్. తాము అభిమానిస్తున్న వారు అనారోగ్యానికి గురైతే.. వారు కోలుకోవాలంటూ యాగాలు.. అభిషేకాలు.. ప్రత్యేక పూజలు చేయటాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చూసి ఉంటాం.

ఇప్పుడు చెప్పే ఉదంతం అందుకు పూర్తి భిన్నమైనది. తనను ఎంతగానో అభిమానించే తన అభిమాని ఆరోగ్యం బాగుండాలని.. అనారోగ్యం నుంచి వెంటనే కోలుకోవాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు ఒకరు ప్రత్యేకంగా పూజలు చేసిన వైనమిది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు వేస్తున్న సీనియర్ నటుడు సుమన్. ఆయన్ను విపరీతంగా అభిమానించే అభిమాని ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన నాగరాజు నాయుడు అనారోగ్యం పాలయ్యారు. ఆర్టీసీ ఉద్యోగి అయిన నాగరాజు నాయుడు అనారోగ్యానికి గురైన సమాచారం తెలుసుకున్న సుమన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తిరుపతికి విమానంలో వెళ్లారు. రేణిగుంటలోని రాజరాజేశ్వరి దేవిని దర్శించుకొని తన అభిమాని త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు. ఇప్పటివరకూ ప్రముఖులకు వారి అభిమానులు పూజలు చేసిన దానికి భిన్నంగా తన అభిమాని కోసం సుమన్ పడిన తపన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.