మహేశ్ ను కొట్టటానికి చేతులు రాక చాలా టేకులు తిన్నదట!

0

ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు విజయశాంతి అలియాస్ రాములమ్మ. అందాల బొమ్మగా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. లేడీ అమితాబ్ ఇమేజ్ ను పొందిన ఏకైక హీరోయిన్ గా చెప్పాలి. స్టార్ హీరోకు పోటాపోటీగా ఫ్యాన్స్ ఉన్న ఏకైక కథానాయికి ఆమె. అలాంటి ఆమె భారీ గ్యాప్ తర్వాత తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 11న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు విజయశాంతి.. దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా మహేశ్ చిన్నతనంలో కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం చిత్ర షూటింగ్ వివరాల్ని గుర్తు చేసుకున్నారు విజయశాంతి. అప్పట్లో మహేశ్ కు పద్నాలుగేళ్లు ఉండేవి. చాలా క్యూట్ గా ఉండేవాడని.. అలాంటిది ఒక సీన్ లో మహేశ్ ను కొట్టాలి. స్టార్ట్ కెమేరా అన్నంతనే చేయి వెళుతుంది కానీ.. కొట్టలేక ఆగిపోతోంది. ఎంత ట్రై చేసినా కుదర్లేదు. ఎన్నో టేకులు తీసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు రాములమ్మ.

ఆ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కోపంతో.. మీరుకొడతారా? లేదంటే షూటింగ్ పేకప్ చెప్పమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారట. అప్పుడు మహేశ్ బాబు రియాక్ట్ అవుతూ.. ఫర్లేదండి.. కొట్టండి అని చెప్పిన తర్వాత.. షాట్ ఓకే అయిన విషయాన్ని రాములమ్మ చెప్పుకొచ్చారు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మహేశ్ తో చేసిన తాను ఇప్పుడింత కాలానికి మళ్లీ పని చేయటం ఆనందంగా ఉందన్నారు. మహేశ్ చిన్నతనంలో షూటింగ్ వేళలో తాను చూసుకుంటే.. ఇప్పుడీ సినిమా షూట్ సమయంలో తనను మహేశ్ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు విజయశాంతి వెల్లడించారు.
Please Read Disclaimer