సురేందర్ రెడ్డి తీయగలడా అన్నారు!

0

`సైరా-నరసింహారెడ్డి` లాంటి భారీ కాన్వాసు ఉన్న సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కించగలడా? రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసుకునే రొటీన్ దర్శకుడికి ఇంత భారీ వారియర్ చిత్రాన్ని తీసే సత్తా ఉందా? టేకింగ్ ఎలా ఉంటుందో ఏమిటో. ఆయనేమైనా రాజమౌళినా? అంటూ పెదవి విరిచేశారు. సైరా షూటింగ్ ప్రారంభం కాక ముందు వ్యాఖ్యలివి. అంతేకాదు షూటింగ్ ప్రారంభం అయ్యాక సురేందర్ రెడ్డిపై రకరకాలుగా ప్రచారం సాగింది. సూరికి ఇలాంటి సినిమాలు తీయడం కత్తి మీద సాము. ఎలాంటి అనుభవం లేకపోవడంతో ఏదీ సరిగా కుదరడం లేదు. మెగాస్టార్ చిరంజీవికి అతడు తీసేది నచ్చడం లేదని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి. ఒకానొక దశలో దర్శకుడిపై చిరు మండి పడ్డారని ప్రచారమైంది.

అయితే అన్నిటికీ అతడు ప్రాక్టికల్ గానే సమాధానం చెబుతున్నట్టు అర్థమవుతోంది. మొన్నటికి మొన్న సైరా మేకింగ్ విజువల్స్ తోనే ఈ సినిమాని అంత భారీ కాన్వాసుపై ఎంత పకడ్భందీగా తీశారో అర్థమైంది. ఇక టీజర్ రాకతో గ్రిప్పింగ్ నేరేషన్ ఉన్న విజువల్స్ ని చూపించే సత్తా దర్శకుడికి ఉందని ప్రూవైంది. అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోదా? టీజర్ చూస్తే ట్రైలర్ ఎలా ఉండబోతోందో ఊహించగలం. ట్రైలర్ వచ్చేస్తే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పగలం. త్వరలోనే ట్రైలర్ తోనూ సైరా టీమ్ దూసుకు రాబోతోంది.

నెగెటివిటీ రాజ్యమేలే చోట సూటి పోటి మాటలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ సమాధానం ప్రాక్టికల్ గా విజువల్స్ తోనే చెప్పాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని పక్కాగా నమ్మి సురేందర్ రెడ్డి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో ఇప్పుడు విజువల్ గా కనబడుతోంది. భారీ బడ్జెట్లతో భారీ కాన్వాసు పై సినిమా అంటే ఆరంభం తడబడి ఉండొచ్చు. నెమ్మదిగా ఒకసారి సర్ధుకున్నాక జాడ పసిగట్టాక మనోడు అన్నిటినీ కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడని అర్థమవుతోంది. సైరా మేకింగ్ ఫెంటాస్టిక్. అయితే ఒక గొప్ప కథను ఏమాత్రం చెడకుండా అంతే అందంగా తెరపై చెప్పడంలోనే దర్శకుని పనితనం చూడగలం. పూర్తి స్థాయి సినిమాగా సురేందర్ రెడ్డి ఎంత గొప్పగా చూపించారు.. అతడి పనితనం ఎంత? అన్నది సైరా రిలీజ్ తర్వాతే తేలేది. సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజవుతోంది. సాహో తర్వాత మళ్లీ అంతే ఎగ్జయిటింగ్ గా ప్రపంచం మొత్తం వేచి చూస్తున్న చిత్రమిది. ఏం చేస్తారో చూడాలి.
Please Read Disclaimer