ఆమె మాటలకు కన్నీరు పెట్టుకున్న స్టార్ హీరో

0

తమిళ స్టార్ హీరో సూర్య నిజ జీవితంలో కూడా హీరో అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సూర్య తనవంతు సాయం అన్నట్లుగా అగరం అనే పౌండేషన్ ను నడిపిస్తున్న విషయం తెల్సిందే. గత పదేళ్లుగా అగరం పౌండేషన్ తరపున వేలాది మంది పిల్లలను చదివించాడు. ఆ పౌండేషన్ సాయంతో చదువుకున్న వారు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన పౌండేషన్ కార్యక్రమంలో గతంలో సాయం పొందిన గాయత్రి అనే అమ్మాయి హాజరు అయ్యింది.

ఆమె మాట్లాడుతూ.. మాది ఒక చిన్న పల్లెటూరు. అమ్మ రోజువారి కూలీగా పని చేసేది. నాన్న క్యాన్సర్ తో బాధపడుతూ ఉండేవాడు. ఊర్లోనే పదవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత చదువుకునే స్థోమత లేకపోవడంతో కూలీకి వెళ్లాలి అనుకున్నాను. కాని అమ్మ మాత్రం బిచ్చమెత్తి అయినా చదివిస్తాను అంది. అప్పుడే అగరం పౌండేషన్ సాయంతో కాలేజ్ చదువు ప్రారంభించాను. నా కాలేజ్ చదువు సమయంలో నాన్న చనిపోయాడు. అప్పుడు మళ్లీ నేను ఏదైనా పని చేయాలనుకున్నాను. కాని పౌండేషన్ వారి సాయంతో నా చదువు పూర్తి చేయగలిగాను అంది.

గాయత్రి కన్నీరు పెట్టుకుని మాట్లాడుతున్న సమయం లో సూర్య కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఏడుపును చాలా ఆపుకునేందుకు ప్రయత్నించినా కూడా ఆయన కళ్లలోంచి కన్నీరు వచ్చేశాయి. ప్రస్తుతం గాయత్రి చదువు పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ కాబోతుందట. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం సూర్య గారు అంటూ ఆమె చెప్పడంతో అంతా కూడా చప్పట్లతో సూర్యను అభినందించారు. సూర్య ఆ సమయంలో కూడా ఆనందంతో గాయత్రిని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నాడు.
Please Read Disclaimer