ఎగిరే విమానంలో సూర్య- మోహన్ బాబు ప్రచారం

0

తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. సింగం-2 తర్వాత సరైన హిట్టు పడలేదు. వరుసగా ఐదారు సినిమాలు తీవ్ర పరాభావన్నే మిగిల్చాయి. సూర్య సెలక్షన్ కి కోలీవుడ్ అభిమానులు సైతం పెదవి విరిచేసారు. ఇక టాలీవుడ్ లో అతని మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. ఒకప్పుడు సూర్య సినిమాలంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడేవారు. అగ్ర నిర్మాణ సంస్థలు సినిమా రిలీజ్ చేసేందుకు పోటీపడేవి. సూర్య పేరుతో ఇక్కడా భారీ లాభాలు దక్కేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త బయ్యర్లు..కొత్త డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సూర్యకు ఆప్షన్ గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం గురు ఫేం సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు సెట్స్ పై ఉంది. ఈ సినిమా తెలుగులో `ఆకాశం నీ హద్దురా` అనే టైటిల్ తో రిలీజవుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకుని పొస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇటీవల ప్రచారంలో టీమ్ వేడి పెంచింది. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్ ను గాల్లో ఎగురుతున్న విమానం ద్వారా రిలీజ్ చేసారు. టైటిల్ కు తగ్గట్టే పిల్ల పులి అనే పాటను ఎగురుతున్న విమానంలో ఆకాశం మధ్యలో రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. దీనికోసం స్పైస్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సూర్య అగరం పౌండేషన్ ద్వారా కొంత మంది పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లందర్ని తొలిసారి ప్లైట్ ఎక్కించి సాంగ్ రిలీజ్ చేయడం విశేషం. వీళ్లందరితో పాటు విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

ఈ తరహా ప్రచారం కోలీవుడ్ లో ఇదే మొదటిది కావడం విశేషం. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 ప్రచార పోస్టర్లను వివిధ దేశాలకు ప్రయాణించే విమానాలపై అతికించి ప్రచారం చేసుకున్నారు. అందుకు నిర్మాతలు భారీగానే ఖర్చు చేసారు. ఆ ప్రచారం బాగా కలిసొచ్చింది. అందుకే ఇటీవలే విడుదలైన దర్బార్ విషయంలోనూ అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. ఈ సినిమా పోస్టర్లను కూడా స్థానికంగా ఎగిరే విమానాలకు అతికించి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సూర్య సినిమాకి అదే పంథాని అనుసరించడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎగిరే విమానంలో ప్రచారం చేసినంత మాత్రాన సినిమా హిట్టవుతుందా? కంటెంట్ మాత్రమే హిట్టిస్తుందన్నది సూర్య ఇకనైనా గ్రహించాల్సి ఉంటుంది. ఆకాశమే హద్దురా కాన్సెప్టు ప్రకారమే ఈ ప్రమోషన్ అని భావించాల్సి ఉంటుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ పై బయోపిక్ కాబట్టి ఈ తరహా ఇన్నోవేటివ్ ప్రచారం అన్నమాట. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
Please Read Disclaimer