టీవీ నటుడికి పాజిటివ్.. ఏడుగురికి టెస్టులు!

0

టీవీ మూవీ షూటింగులకు ప్రభుత్వాలు అనుమతులివ్వడంతో.. తొలిగా టీవీ సీరియళ్ల షూటింగులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఫిలింనగర్ – కృష్ణానగర్ లో సందడి మొదలైంది. అయితే ఈ హడావుడి ఇంతలోనే ఆవిరైంది. దానికి కారణం ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్.బి కి కరోనా పాజిటివ్ అన్న ఆందోళన.

నటుడు ప్రభాకర్ కి పాజిటివ్ అని తేలగానే మరో ఏడుగురు యూనిట్ సభ్యులకు పరీక్షలు చేసింది వైద్యబృందం. అదృష్ట వశాత్తూ వీరెవరికీ పాజిటివ్ రాలేదని తెలిసింది. దీంతో కొంత ఆందోళనా తగ్గింది. ప్రస్తుతానికి సీరియళ్ల షూటింగులు ఆగిపోయాయి. త్వరలోనే ప్రారంభించే వీలుందా? అంటే సందేహమేనని చెబుతున్నారు. మరోసారి షూటింగులకు బ్రేక్ ఇచ్చి కాస్త వేచి చూసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

ప్రభాకర్ సూర్యకాంతం(జీ తెలుగు) అనే సీరియల్ సహా మరో సీరియల్ లోనూ నటిస్తున్నారు. ఆయన తిరుపతి నుంచి హైదరాబాద్ కి వచ్చారు. షూటింగులో పాల్గొన్నారు. అనంతరం జ్వరం దగ్గు రావడంతో కరోనా టెస్టులు చేయించగా పాజిటివ్ అని తేలింది. అతడి సంగతి తెలిసిన తర్వాత టాలీవుడ్ లో టీవీ సీరియల్ నటీనటులతో పాటు సినీహీరోలంతా అలెర్ట్ అయిపోయారని తెలుస్తోంది. ఆగస్ట్- సెప్టెంబర్ వరకూ సినిమాల షూటింగులు ప్రారంభించాల్సిన పని లేదని కూడా అంతా భావిస్తున్నారట.
Please Read Disclaimer