నిర్మాతగా మెగా డాటర్ .. సొంత OTT కూడా?

0

సినిమాలు నిర్మించడం మెగా ఫ్యామిలీకి కొత్తేమీ కాదు. అప్పట్లోనే బాస్ అల్లు అరవింద్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాలకు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించిన అంజనా ప్రొడక్షన్స్ కి చిరు బ్యాక్ బోన్ గా నిలిచారు. చిరంజీవి.. చరణ్ మెగాబ్రదర్ బ్యానర్స్ లో నటించారు. అలా చిరు- నాగబాబు నిర్మాతలుగా కొనసాగారు. తమ బంధువే అయిన డాక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి చిరు- నాగబాబు సినిమాలు తీసారు. ఇటీవల చరణ్ మెగా బ్రదర్ బ్యానర్ లోనే ఆరంజ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

అదంతా అటుంచితే… ఇటీవల తన తల్లి సురేఖ కోరిక మేరకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే మెగాస్టార్ 150వ సినిమా ఖైదీనంబర్ 150 .. 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` తెరకెక్కాయి. ఆ రెండు సినిమాలు కొణిదెల బ్యానర్ విలువను అమాంతం పెంచాయి. నిర్మాతగా చరణ్ స్టామినా ఏపాటిదో బయటి ప్రపంచానికి అర్థమైంది. ప్రస్తుతం చిరు 152 వ మూవీ ఆచార్యకు కొణిదెల బ్యానర్ భాగస్వామ్యం ఉంది. తదుపరి చిరు 153వ చిత్రం ఇదే బ్యానర్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నిర్మాతగా చరణ్ సుశిక్షితుడు అయ్యాడు.

అయితే చరణ్ సక్సెస్ ని అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని అదే స్ఫూర్తితో అతడి సోదరి సుస్మిత కొణిదెల సినీనిర్మాణంలోకి అడుగు పెడుతున్నారని సమాచారం. చిరు-చరణ్ అండదండలతోనే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ ని ప్రారంభించి ఇందులో ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. నిజానికి సుశ్మితకు ప్రొడక్షన్ వ్యవహారాలేవీ కొత్తేమీ కాదు. ఖైదీనంబర్ 150 – సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూనే ప్రొడక్షన్ వ్యవహారాల్ని చక్కబెట్టారు. నిర్మాత రామ్ చరణ్ కి చేదోడువాదోడుగా నిలిచి తాను కూడా బోలెడంత అనుభవం ఘడించారు. ఇప్పుడు అదే అనుభవంతో వెబ్ సిరీస్ ని నిర్మించి తదుపరి పలు చిత్రాల్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇకపై మెగా యువహీరోలతో సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం.

వెబ్ సిరీస్ లకు మునుముందు ఉన్న ఆదరణ దృష్ట్యా సొంతంగా ఓటీటీ- డిజిటల్ వ్యాపారంలోకి మెగా ఫ్యామిలీ దిగనుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సుస్మిత అందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అల్లు అరవింద్ `ఆహా` తో డిజిటల్లో గొప్ప అనుభవాల్ని ఘడిస్తున్నారు. అవన్నీ మెగా వారికి స్ఫూర్తిగా నిలవనున్నాయని తెలుస్తోంది.