రిలీజ్ డేట్ దోబూచులాట కొనసాగుతోందే!

0

ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కావడం పక్కా కానీ రిలీజ్ డేట్లు అడిగితే మాత్రం ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. కొందరేమో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న రిలీజ్ అవుతుందని.. ‘అల వైకుంఠపురములో’ ఒకరోజు తర్వాత జనవరి 12 న విడుదల అవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై రెండు సినిమాల మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ పెంచుతున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు నిన్నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు మహేష్ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ బృందం విడుదల చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ తప్ప అన్నీ ఉన్నాయి. ఈమధ్య రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ లో దాదాపుగా రిలీజ్ డేట్ జనవరి 11 అనే ఉంది కానీ ఈ సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్ లో మాత్రం అది లేదు. దీంతో పోటీలో ఉన్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ డేట్ ను బట్టి మహేష్ సినిమా తేదీని ఖరారు చేస్తారనే వాదన వినిపించింది.

సీన్ కట్ చేస్తే ఈ రోజు ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు కూడా సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘అల వైకుంఠపురములో’ టీమ్ కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ మిస్సింగ్. దీనర్థం.. విడుదల తేదీల దోబూచులాట తారాస్థాయికి చేరిందన్నమాట. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగేలా చేస్తున్నారు.

నిన్న ‘మా’ అసోసియేషన్ కొంచెం రచ్చ జరిగితేనే అందరూ క్లాసులు పీకారు. మరి ఈ రిలీజ్ డేట్ విషయాలు.. ఈ గొడవలు.. ఈ ఈగోలు..ఈ గోలలు ‘మా’ పరిథి లోకి రావా? లేదా పెద్ద స్టార్ హీరోలు అని ఇన్వాల్వ్ కావడం లేదా? ‘మా’ కు ఇలాంటి విషయాలు పట్టవా? ఏదేమైనా.. ఈ దోబూచులాటలు బయ్యర్లకు టెన్షన్లు పెంచుతున్నాయని అంటున్నారు. పాపం.. వారు తమ సమస్యలను ఒకరి చెవిలో ఒకరు చెప్పుకుని పరిష్కారం అవసరం లేకుండా సాంత్వన పొందాలేమో!
Please Read Disclaimer