కెలికి మరీ ప్రముఖ నటితో క్లాస్ పీకించుకున్న బీజేపీ నేత

0

అన్ని తెలుసనుకోవటంతోనే సమస్య వస్తుంది. ఒకరిపై విరుచుకుపడే సమయంలో ఆవేశం.. అంతకు మించిన ఆగ్రహం వెరసి తప్పులు చేయటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తమ పార్టీ నేతకు పంచ్ వేసిన వారిపై రివర్స్ పంచ్ వేసే ఉత్సాహం వరకూ ఓకే. అత్యుత్సాహంతోనే ఇబ్బంది అంతా. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటికి ఒక బీజేపీ నేత పంచ్ వేయబోయి అడ్డంగా బుక్ అయిన ఉదంతం చోటు చేసుకుంది.

సోషల్ మీడియా లో ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటి స్వరా భాస్కర్ వివిధ అంశాల మీద స్పందిస్తుంటారు. మిగిలిన వారి మాదిరి గ్లామర్ కబుర్ల కే పరిమితం కాకుండా రాజకీయ.. సామాజిక అంశాల మీద తన అభిప్రాయాల్ని చెప్పేందుకు అస్సలు వెనుకాడరు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి విమర్శలు చేశారు. షహీన్ బాగ్ లో బిర్యానీ పంచుతూ కేజ్రీ బిజీగా ఉన్నారన్నారు.

దీనికి స్వరా స్పందించారు. అరే.. నాయనా ఎవరైనా ముందు ఈయనకు బిర్యానీ తినిపించండి.. బాగా ఆకలిగా ఉన్నట్లున్నారు అంటూ.. I think he is ‘Hangry’ అని బదులిచ్చారు. యోగి లాంటి పెద్ద నేతను ఒక సినీ నటి కామెంట్ చేయటమా? అంటూ రగిలిపోయారు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు రాహుల్ కొఠారి. ఆమెకు రివర్స్ పంచ్ ఇచ్చేందుకు వీలుగా పబ్లిసిటీ కోసం ఇంత పిచ్చిందుకానీ హంగ్రీ (Hungry) స్పెల్లింగ్ మాత్రం రాదంటూ ఎటకారం ఆడేశారు.

ఇలాంటి వాటిని స్వరా వదిలేస్తారా ఏంది? వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆగ్రహం తో తొందర పడిన బీజేపీ నేతకు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారు. సిట్ డౌన్ అంకుల్.. అంటూ తాను వాడిన Hangry పదానికి అర్థాన్ని షేర్ చేశారు. ఇలా నేత వర్సెస్ నటి మధ్య నడుస్తున్న ట్వీట్ల వార్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికైతే నటి స్వరా భాస్కర్ దే పైచేయిగా ఉందని చెప్పాలి.
Please Read Disclaimer