‘మగధీర’ ను గుర్తు చేసిన ‘సైరా’

0‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ మెగా అభిమానులకు కనువిందే చేసింది. ‘బాహుబలి’ తర్వాత అలాంటి విజయం సాధించగల సినిమాగా ఉన్న అంచనాల్ని టీజర్ అందుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలకు ఇది తెరదించింది. విజువల్స్ పరంగా ‘సైరా’కు తిరుగులేదని టీజర్ ను బట్టి అర్థమైంది. అలాగే కెరీర్లో ఎక్కువగా క్లాస్ సినిమాలే చేస్తూ వచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మన ప్రేక్షకుల అభిరుచి ఏమాత్రం తెలుస్తుంది.. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు సరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వగలడా అన్న అనుమానాల్ని కూడా టీజర్ పటాపంచలు చేసింది. విజువల్స్ కు తగ్గట్లే గూస్ బంప్స్ ఇచ్చే బీజీఎం ఇచ్చాడతను. ఈ రెండు విషయాల్లో ‘సైరా’ టీజర్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఇక టీజర్లో ప్రత్యేకంగా అనిపించిన షాట్లలో చెట్ల పొదల్లోంచి గుర్రం మీద చిరు దూసుకొచ్చే షాట్ ఒకటి. టీజర్లోనే ఈ షాట్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఈ షాట్ చూసిన వాళ్లకు ‘మగధీర’ సినిమాలో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రో సీన్ గుర్తుకు రాకుండా ఉండదు. నీటి లోంచి గుర్రం మీద దూసుకొచ్చి విలన్ తో పోటీకి రెడీ అవుతాడు చరణ్. ఆ సన్నివేశం ప్రేక్షకుల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా తండ్రిని తనయుడు అనుకరిస్తుంటాడు. కానీ ఇక్కడ చిత్రంగా కొడుకునే తండ్రి అనుకరించడం విశేషం. మరి ‘మగధీర’లో మాదిరే ఈ సీన్ కూడా స్టాండ్ ఔట్ గా నిలిచి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందేమో చూడాలి. టీజర్ మొత్తంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే షాట్లు చాలానే ఉన్నాయి. వీటిని అంచనాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దితే ‘సైరా’ చారిత్రక విజయాన్నందుకోవడం ఖాయం.